అపార నష్టం.. తీరని కష్టం | Sakshi
Sakshi News home page

అపార నష్టం.. తీరని కష్టం

Published Sun, Nov 24 2013 3:58 AM

Cyclone Helen flattens 10 lakh acres of crops

సాక్షి, ఏలూరు :‘ఏం పాపం చేశామని మాకీ శాపం. పుడమి తల్లిని నమ్ముకున్న మాకు ఎందుకీ శోకం...’ అంటూ అన్నదాతలు దీనంగా ఆ దేవుణ్ణి అడుగుతున్నారు. కలోగంజో తాగుతూ.. నాలుగు తాటాకులతో గూడు కట్టుకున్న తమపై ప్రకృతికి ఎందుకింత కోపమని అభాగ్యులు ఆక్రోశిస్తున్నారు. పంటలు మునిగి.. ఇళ్లు కూలి.. దిక్కుతోచని స్థితిలో ప్రజలంతా వేదనకు గురవుతున్నారు. తుపాను ప్రభావానికి గురైన 8 మండలాల్లోని 37 గ్రామాల్లో ‘సాక్షి’ బృందం శనివారం పర్యటించింది. ఎక్కడ చూసినా కళ్లు చెమర్చే దృశ్యాలే కనిపించాయి. 
 
 అష్టకష్టాల్లో అన్నదాతలు
 హెలెన్ తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా 2లక్షల 57 వేల 115 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కొద్దోగొప్పో మిగిలిన పంటను దక్కించుకోవడానికి అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. నేలనంటిన.. నీట మునిగిన వరి దుబ్బులను కోసి.. బరకాలపై వేసి రోడ్లపైకి తెచ్చుకుంటున్నారు. ఎక్కడికక్కడ బరకాలపై పనలను ఆరబెడుతున్నారు. 120నుంచి 130 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు 2,320 ఎకరాల్లో అరటి, 1,388 ఎకరాల్లో కూరగాయ పంటలు కలిపి మొత్తం 3,693 ఎకరాల్లో ఉద్యాన పంటలు పనికిరాకుండా పోయాయి. చేపల చెరువుల గట్లు ఏకమైపోయూయి. ఆక్వా రైతులకు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దాదాపు 400కొబ్బరి చెట్లు ధ్వంసమయ్యూయి.
 
 పై-లీన్ నష్టం రూ.250 కోట్లు.. 
 హెలెన్ నష్టం రూ.500 కోట్లు
 హెలెన్ తుపాను ప్రభావంతో పంటలు, ఆస్తులకు ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.600 కోట్లమేర నష్టం వాటిల్లినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో పంటనష్టాల విలువ రూ.500 కోట్ల మేర ఉంటుందని అం చనా. గత నెలలో పై-లీన్ తుపాను, అల్పపీడనం కారణంగా జిల్లాలో 1.36 లక్షల ఎకరాల్లో వరి నీటిపాలైంది. అప్పట్లో పంటలకు సుమా రు రూ.250 కోట్ల మేర నష్టం వాటిల్లగా, హెలెన్ తుపాను దానికి రెట్టింపు నష్టం మిగి ల్చింది. రెండు ఉపద్రవాల వల్ల మొత్తం రూ.750 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో 6 లక్షల ఎకరాల వరి వేయగా, కేవలం రెండు లక్షల ఎకరాల్లో మాత్రమే పంట మిగి లింది. అదికూడా నీటిలో నానుతోంది. ఇదిలావుండగా, హెలెన్ తుపాను ప్రభావంతో 22 పక్కా ఇళ్లు, 113 పూరి గుడిసెలు నేలమట్టమయ్యూరుు. మొత్తంగా 882 ఇళ్లు దెబ్బతిన్నాయి. వాటిలో నివసించేవారికి నీడ కరువైంది. కొందరు పొరుగు ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు. ఈ నష్టం విలువ ఎంత అనేదానిపై అధికారులు అంచనాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యూరు. 
 
 ప్రభుత్వ ఆస్తులకూ భారీ నష్టం
 116 కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు, 110 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్లు ధ్వంసమయ్యాయి. పంచాయతీ రోడ్లకు రూ.5.19 కోట్ల మేర నష్టం వాటిల్లింది. తీర గ్రామాల్లో అత్యవసరంగా రోడ్లకు మరమ్మతులు చేసేందుకు కలెక్టర్ సిద్ధార్థజైన్ రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో వేములదీవి, బియ్యపుతిప్పలో రెండు కాలనీలు, చినమైనివానిలంక, తూర్పుతాళ్లు నుంచి వేములదీవి రోడ్డును శనివారం యుద్ధప్రాతిపదికన నిర్మించారు. 
 
 విద్యుత్ శాఖకు నష్టాల షాక్
 రూ.35 లక్షల విలువైన 312 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 100 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. వీటి నష్టం రూ.15 లక్షలుగా అంచనా వేస్తున్నారు. మొత్తం మీద విద్యుత్ శాఖకు రూ.50 లక్షల నష్టం వాటిల్లింది. 20 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు తెగిపోయాయి. వాటిని బాగుచేయడానికి 25మంది అధికారులు, 200 మంది సిబ్బంది రెండు పొక్లెయిన్ల సాయంతో శ్రమిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించినప్పటికీ, నరసాపురం మండలంలో 12 గ్రామాలు, యలమంచిలి మండలంలో 8 గ్రామాలు, మొగల్తూరు మండలంలో 10 గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి గానీ సరఫరా పునరుద్ధరించలేమని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 4,985 మందిని తరలించారు. వారికి 12,846 ఆహార పొట్లాలు, 26,756 మంచినీటి ప్యాకెట్లు అందించారు. 97 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు వైద్యసేవలు చేస్తున్నారు. మరో తుపాను ముప్పు పొంచి ఉందని తెలియడంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement