నిందకి.. నిబద్ధతకి నడుమ

17 Sep, 2016 01:23 IST|Sakshi
నిందకి.. నిబద్ధతకి నడుమ

జాతిహితం
 
మౌలికంగా చూస్తే, కించపర్చడం, నిందించడం బలానికి చిహ్నం కాదు. దోమకాటు సొగసైంది కానప్పటికీ దాని దురద మాత్రం ప్రభావం చూపుతుంటుంది. మీ రాజధానిలో ప్రబలిపోతున్న చికున్‌గున్యా, డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపడానికి, అందరినీ కార్యాచరణలోకి దింపడానికి మీ దూషణ ఉపయోగపడినట్లయితే, దోమకాటుకు గురై వారాలపాటు బాధపడుతూ, పనికి దూరమయ్యే వేలాది మందిని లేదా కొద్దిమంది జీవితాలనైనా అది కాపాడగలిగినట్లయితే గెలుపు మీదేనని మీకు అర్థమవుతుంది.
 
మూడేళ్ల క్రితం వరకు కూడా ‘కించపరచడం’ (ట్రాలింగ్) అనే మాట గురించి నేను అంతగా పట్టించుకోలేదు. దాని అసలు అర్థం ఏదో కూడా గమనించలేదు. చీకటి గుహలలో నివశిస్తారని చెప్పే మరుగుజ్జు కల్పిత పాత్రల రూపాలను బొమ్మల అమ్మకాలకు ప్రసిద్ధిగాంచినహేమ్లే దుకాణా లలో అమ్ముతారు. కంటికి అంతగా ఇంపుగా లేకపోయినా కొద్దిగా ఆక ర్షణీయంగా మాత్రం ఉండే ఆ కల్పితరూపాలనే ట్రాల్స్ అంటారనే నేను అనుకున్నాను. ట్రాలింగ్ లేదా కించపరచడం, గేలి చేయడం అనే అర్థం వచ్చే ఆ పదాన్ని మళ్లీ నేను వినడం ఇంటర్నెట్ యుగంలోనే. తమ ఉనికిని చాటుకోవడానికి లేదా ఏదైనా అలజడి సృష్టించడానికి తమ పేరు మాత్రం బయటపెట్టకుండా, బుద్ధిపూర్వకంగా ఒక సందేశాన్ని ఇంటర్నెట్‌లో ప్రవేశ పెడితే దానిని ట్రాలింగ్ అంటున్నారు. అది ఇంటర్నెట్ కాబట్టి ఆ సిగ్గుమాలిన వ్యంగ్యంతో ఎవరినైనా నీవు గిల్లగలవు అని అర్బన్ డిక్షనరీ వివరణాత్మకంగా చెబుతోంది. ‘ఔను, మనం చేయగలం కాబట్టి చేద్దాం’ అన్నట్టు ఉన్న  ఈ వివ రణ ఇలా గిల్లి ఏడిపించే పటాలాలకి కవాతు గీతంలా ఉపయోగపడుతుంది.

నింద అనండి లేదా ఇంకా సరికొత్తగా ఉండాలంటే మర్యాద మీరడం అనండి. కించపరచడం అనేది ఇప్పుడు ప్రపంచమంతటా వినిపిస్తున్న మాట.  అది విశ్వవ్యాప్తం. భారత్ కూడా ఈ విషయంలో వెనకబడలేదు. తిట్టి పోయడంలో మనం ఇంకో రెండాకులు ఎక్కువే చదివామని కూడా నేను చెప్పగలను. ఎందుకంటే తిట్ల విషయంలో మనకున్న భాషా వైవిధ్యం అంతటిది మరి. తార్పుడుగాడు అన్నమాట దళారి లేదా కుక్క అనే మాట లతో సమానార్థకం కాదు. ఆ పదంలోని ధ్వని కూడా వీటిలో లేదు. ఒక వ్యక్తిని మీరు కుత్తా (కుక్క) అని పిలిచి అవమానించదలిచినా, ప్రయోగంలో మాత్రం ఇతర బూతుపదాలే వస్తున్నాయి. ఐదేళ్ల నాడు ఇలాంటి పదాలు వాడడం పూర్తిగా నిషిద్ధం. కానీ ఇప్పుడు వాడుకలోకి వచ్చాయి.

ఏమైనప్పటికీ తిట్లకున్న శక్తి ఇంతగా పెరిగిందంటే ఆ కీర్తి అంతా ఇంటర్నెట్‌కే ఆపాదించడం న్యాయం కాదు. ఆ శక్తి మన రాజకీయాలకీ, చర్చా గోష్ఠులకీ ఎప్పుడూ ఉంది. ఇంటర్నెట్, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా తిట్ల శక్తిని ప్రధాన జనజీవన స్రవంతిలోకి తెచ్చి పడేశాయి. అంతేకాదు, తిట్లకి సామాజిక గౌరవం కల్పించాయి. చాలా పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్లు, ఉన్నత స్థాయి కలిగినవాళ్లు; ప్రపంచంలో నాలుగో అతిపెద్ద సైన్యానికి ప్రధాన అధికారి మొదలుకొని, కేంద్ర మంత్రులు, ఇంకా ఒక రాష్ట్రానికి రాజ్యాంగ హోదాతో ముఖ్యమంత్రి పదవికి ఎన్నికైన వారి వరకు అంతా తిట్టు అనే ఆ ఆయుధాన్ని యథేచ్ఛగా ఉపయోగించుకోగలరు. మీకు కుస్తీ క్రీడతో పరిచయం ఉంటే సంగతి- ఆ క్రీడలో ఛాతీకి పై భాగంలోనే కొట్టడాన్ని అనుమతిస్తారు. పూర్వం రాజకీయాలు గ్రీకో-రోమన్ శైలిలో ఉండేవి. ఆ కుస్తీ మాదిరిగానే. ఇప్పుడు, డబ్ల్యు డబ్ల్యు ఎఫ్‌లో మాదిరిగానే ఎవరి ఇష్టం వారిది. ఏదిఏమైనా ఏదో రకంగా గెలవడం, ఉనికిని చాటు కోవడమే అక్కడ బరిలో ప్రధానం.

ఎవరినైనా మనం దళారి అనో, కుక్క అనో తిడితే  లేదా తల్లినో, చెల్లినో తిడితే వారు అందుకు బాధపడుతున్నారా? ఇంతకు ముందు నేను చేసిన ఉద్యోగంలో ఎప్పుడూ కోపతాపాలతో ఉండే కార్మిక సంఘాలతో వ్యవహా రాలు చక్కబెట్టవలసి ఉండేది. ముఖ్యంగా వారు నేను ‘జాతిహితం’ కాలమ్ రాసే శుక్రవారం మధ్యాహ్నం మరీ ఆగ్రహావేశాలతో ఉండేవారు. వారంతా ఒక బహిరంగ పార్కింగ్ స్థలంలో గుమిగూడి ముర్దాబాద్ (నశించాలి) అంటూ నినాదాలు చేసేవారు. పైగా ఆ పార్కింగ్ స్థలం నేను కూర్చునే స్థలం దగ్గర కిటికీకి అనుకునే ఉండేది. రెండుగంటల పాటు నినాదాలతో బాజాలు వాయించేవారు. కొన్నిసార్లు దారుణమైన శబ్దాలు చేసేవారు. నా బాధ గురించి మా మేనేజర్‌కి చెప్పాను. దానికి ఆయన, అలా బాధపడకండి, కొంచెం ఆలోచించండి. నినాదాలు చేసిన ప్రతిసారి వాళ్లు మీరు నశించాలి అంటున్నారు. అంటే  వాళ్లు ఆ నినాదం ఇచ్చిన ప్రతిసారి మీకు ఒకరోజు ఆయుష్షును పెంచుతున్నారు. అది చాలా కష్టమైన సలహా. కానీ ఉపయో గపడే సలహా. నిజానికి మా మేనేజర్ తర్కం నిజమే అయితే నాకు కొన్ని రోజులు, వాస్తవం చెప్పాలంటే కొన్ని మాసాల జీవితకాలం బోనస్‌గా వచ్చి ఉండాలని నేను నమ్ముతున్నాను.

ఇంటర్నెట్, సోషల్ మీడియా తెచ్చిన మరో మార్పు- దూషణని ఆమో దయోగ్యం చేయడమే కాకుండా, దానిని ప్రజలందరి పరం చేశాయి. సాధా రణంగా ప్రజల నోళ్లలో నానుతున్న, మరీ ముఖ్యంగా ప్రచురణ సంస్థను నడుపుతున్న వారికి ఈ దూషణతో పరిచయం ఉండదు. వారికి ఫోన్ ద్వారా లేదా ముఖాముఖీ తిట్లు తినే పరిస్థితి రాదు. కానీ ఇద్దరు వ్యక్తులలో మాత్రం అది ఉండేది. నేను మాట్లాడిన చాలామందిలో ఇప్పటికీ నేను అభిమా నించేవారు మాత్రం అర్జున్‌సింగ్. ఆయనంటే మా పేపరు సదా మండిపడేది. ఆయనే ఒక ఉదయం నాకు ఫోన్ చేసి, మీరు ఎవరి పేరు మీద ఈ పత్రిక నడుపుతున్నారో, ఆయనే కనుక జీవించి ఉంటే (రామ్‌నాథ్ గోయెంకా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్) మీరు ఒక్క వారం కూడా ఉద్యోగంలో ఉండేవారు కారని నేను కచ్చితంగా చెప్పగలను అన్నారు. దానికి నేను చెప్పినదేమిటంటే, అయ్యా! ఆయన మన మధ్య లేరు. వెనక్కి తిరిగిరారు. కాబట్టి దురదృష్టవ శాత్తు మీ కోరిక నెరవేరడానికి ఉన్న అవకాశాలు పరిమితం అని.

ఇలాంటి సంభాషణలు కటువుగా ఉంటాయి. అయినప్పటికీ సమా చారం వ్యవస్థ చతికిల పడడానికి, మాటలు తెగిపోవడానికి ఎప్పుడూ కార ణం కాలేదు. కాబట్టి ఆ మేరకు తృప్తిపడాలి. అంత జరిగినా కూడా అర్జున్ సింగ్‌ని ఎప్పుడు సమయం కోరినా మాట్లాడేవారు. ఇంకొకరు ములాయం సింగ్ యాదవ్. ఫోన్‌లో కొన్ని నిమిషాల మాటల యుద్ధం తరువాత, మీ కాలమిస్ట్ తవ్లీన్‌సింగ్ కాళ్లు విరిగితే అందుకు బాధ్యత మాత్రం నాది కాదు అని ములాయం సింగ్ యాదవ్ బెదిరించడం మరొకటి. అయితే మళ్లీ వెంటనే ఫోన్ చేసి ఆ మాట అన్నందుకు ఆయనే క్షమాపణలు కోరారు. బాలా సాహెబ్ ఠాక్రే విషయం కూడా ఎంతో సంతోషం కలిగించేదే అవుతుంది. ఆయనను మాఫియాకు చెందినవాడని నేను రాసినప్పుడు ఆయన ఫోన్ చేసి, నన్ను తిడుతూ రాసేవారందరిలోకి మీరు రాసింది చాలా ఆనందించ దగినదిగా ఉంది.

కాబట్టి మా ఇంట్లో నేను మీకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంటుందా అని అడిగారు. తినడం, తాగడం మాట ఎలా ఉన్నా నేను వెళ్లాను. తరువాత ఆయన 80వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఇంట ర్వ్యూలో నన్ను కూడా భాగస్వామిని చేశారు. ఒక వైట్‌వైన్ సీసా ఖాళీ చేసేవరకు ఆ ఇంటర్వ్యూ సాగింది. వీధికి ఎక్కనంతవరకు పత్రికా రంగంలో సాగే సంబంధాలకీ, కార్యా లయంలో తయారైన వార్తలకీ బంధం బాగానే ఉంటుంది. ఒకసారి వేడివేడి సవాళ్లు విసురుకోవడం కనిపిస్తుంది. తరువాత చల్లబడడమూ ఉంటుంది. ఒకవేళ అవహేళనకు గురైనవారు అందుకు బాధ్యత వహించవలసి ఉంటే అందుకు సిద్ధపడాలి. అప్పుడే సమాచార మార్పిడికి ద్వారాలు మూసుకు పోకుండా ఉంటాయి. కానీ సోషల్ మీడియాలో ఇలాంటి విమర్శలు, అవహేళనలు  వెలువడినప్పుడు అనంతర పరిణామాలు వేరు మలుపు తీసుకుంటున్నాయి.

ఇది పత్రికా రచయితలకి గట్టి సవాలే. దులుపుకుని పోయేవారైనా వారూ మనుషులే, ఖడ్గమృగాలు కాదు. ఎవరైనా విమర్శను ఊరికే గాలికి వదిలిపెట్టగలరా? మరో గట్టి ప్రశ్న కూడా ఉంది. కొందరు కించపరచడం వల్ల, ఆ చిన్నచూపులోని దూషణ వల్ల అది చేసిన వారి పట్ల మీ సంపా దకులుగా మీకు ఉన్న అభిప్రాయంలో మార్పు వస్తుందా? లేదా వారు అనుసరించే రాజకీయ తాత్వికత పట్ల అభిప్రాయం మారుతుందా? దీనికి  కాదు అనే సమాధానం చెప్పాలనిపిస్తుంది. కానీ నిజమైన జవాబు మాత్రం అవును అనే. ఎందుకంటే నీవు పోటీలోకి దిగనంతవరకు నీవు పోటీదారుడివి కావు. నీవు రాసుకునే రోజున కిటికీకి చెంతన నిలబడి నశించాలి అంటూ నినాదాలు చేసేవారిలాగా తిట్టేవాళ్లు ఎప్పుడూ తిడుతూనే ఉంటారు. కానీ వాళ్లు నీ చావును చూడాలని కోరుకోరు.

నీవు భయపడినా, భయపడి నీ ఆలోచన నుంచి నీవు తప్పుకున్నా అదే వారికి లబ్ధిని చేకూరుస్తుంది. అయితే ఆ కార్మిక సంఘాల అల్లర్లను నీవు పట్టించుకోకుండా నీ పని నీవు చేస్తే నీవు గెలిచినట్టే. ఇది గాంధీగారు, ఒక చెంప వ్యవహారం కాదు. ఒక మంచి, నిర్దిష్ట బాధ్యత. బన్సిలాల్ మన రాజకీయవేత్తలలో అత్యంత మొరటు రాజకీయ వేత్త. అలాంటి వాళ్లు సోషల్ మీడియా, ఇంటర్నెట్ యుగంలో ఎలా మెలిగే వారని ప్రశ్నించుకుంటూ ఉంటాను. వాళ్లు పూర్తిగా అదుపు తప్పి, ఆగ్రహా వేశాలు ప్రదర్శిస్తారా? బహుశా కాకపోవచ్చు. అలాంటివాళ్లు తాము చేయ దలుచుకున్నది చాలా జాగ్రత్తగా, కనీసం ఆధారాలు లేకుండా పూర్తి చేస్తారు. నేను విద్యార్థిగా ఉండగా చూసిన సంగతి- ఎమర్జన్సీ సమయంలో కొందరు నల్ల జెండాలు పట్టుకుని బన్సీలాల్ ఇంటి ఎదుట నిరసన ప్రదర్శన నిర్వ హించారు. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? ‘‘సోదరులారా? నేను పుట్టినప్పుడు మా అమ్మ 12 గజాల నల్లని వస్త్రంలో ఉంచింది. కాబట్టి నేను మీ నల్లజెండాలకి భయపడను’’.

మౌలికంగా చూస్తే, కించపర్చడం, నిందించడం బలానికి చిహ్నం కాదు. ప్రత్యేకించి వ్యతిరేకత ప్రబలుతున్న నేపథ్యంలో మీరు దీనికి పాల్పడటం సరైంది కాదు. దోమకాటు సొగసైంది కానప్పటికీ దాని దురద మాత్రం ప్రభావం చూపుతుంటుంది. మీ రాజధానిలో ప్రబలిపోతున్న చికున్ గున్యా, డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపడానికి, అందరినీ కార్యాచరణలోకి దింపడానికి మీ దూషణ ఉపయోగపడినట్లయితే, దోమ కాటుకు గురై వారాలపాటు బాధపడుతూ, పనికి దూరమయ్యే వేలాది మందిని లేదా కొద్దిమంది జీవితాలనైనా అది కాపాడగలిగినట్లయితే గెలుపు మీదేనని మీకు అర్థమవుతుంది. దోమకాటును పెద్దగా పట్టించుకోకండి. అది కుట్టినప్పుడు కాస్త గోక్కోవచ్చు లేదా ప్రైవేట్‌గా అయినా సరే తిట్టుకోవచ్చు. తర్వాత అలా సాగిపోవచ్చు.

శేఖర్ గుప్తా
 twitter@shekargupta

>
మరిన్ని వార్తలు