అందులో సుఖం లేదు

1 Jul, 2017 01:29 IST|Sakshi
అందులో సుఖం లేదు

అక్షర తూణీరం

పాపాలకు రేపు నువ్‌ అనుభవించబోయే శిక్షలో సగం వాటా నీ అర్థాంగి స్వీకరిస్తుందేమో కనుక్కోమన్నాడు. ఆమె నిర్దాక్షిణ్యంగా నవ్వింది.

  కాపరానికి రాక ముందునించి క్రమం తప్పకుండా చూస్తున్న సీరియల్‌ని సైతం పక్కన పెట్టి, ఆబాల గోపాలం ఆసక్తిగా తిలకించే సందర్భం ఒకటుంది. అది– అవినీతి తిమింగలాలు, అక్రమాస్తుల అనకొండలు నిజరూపాలతో సహా వెలుగులోకి వచ్చినప్పుడు. మరీ పాతతరం ఇల్లాండ్రు ఎంత ఇష్టంగా చూస్తారో చెప్పలేం. క్రికెట్‌ చూస్తున్నంత ఉద్వేగంతో అరుపులు, కేకలు కూడా ఉంటాయి. ఆహా! ఆహా! బంగారు కంచాలండీ! ఏకంగా ఓ దొంతరండీ! అమ్మో! ఆ వఢ్రాణం చూడండి... మూడు చుట్ల వఢ్రాణమండీ! మా తాతమ్మకి ఉండేదని చెప్పుకునేవారు. ఆ ఉంగరాలేమిటండీ.. మరచెంబెడున్నాయి. అమో! అది రెండు పేటల కాసులపేరు. ఏవండీ... చూస్తున్నారా ఎంతబరువుందో! ‘‘ఔను, చాలా బరువుంది. మెళ్లో వేసుకోవాలంటే క్రేన్‌ కావాలి’’. ‘‘అంతేలెండి, అందని ద్రాక్షపళ్లు పుల్లన’’అంటూ ఆవిడ అసహనానికి గురి అవుతుంది. కూడబెట్టడం అందరూ చేస్తారు.కానీ మంచి అభిరుచితో నగానట్రా రూపంలో మదుపు చేయడం కొందరికే సాధ్యం.

ఆనాడు భక్త రామదాసు రాములోరి ఫ్యామిలీకి వైనవైనాలుగా చేయించిన చందంగా పుట్టబోయే వారికి బంగారు ఉగ్గు గిన్నె లు సిద్ధం చేశారు దూరదృష్టి గల అవినీతి కోవిదులు. వాళ్లని చూ స్తే జాలేస్తుంది. రెండు చేతులా ఆర్జించి, తమ సుఖ సంతోషాలకు ఆట్టే వెచ్చించక కుటుంబ సంక్షేమం కోసం ధన కనక వస్తు వాహనాల రూపేణా తరు, జల, పాషాణ, నిధినిక్షేపాలతో సహా భూవసతి రూపేణా ఏర్పాటు చేసుకున్నారు. ఇదే వారికి శాపంగా మారింది. వారు సర్వత్రా వార్తలుగా వాసికెక్కారు.

మొత్తం సర్వీస్‌ పొడుగునా ఆర్జించిన కష్టార్జితం, క్లిష్టార్జితం ఒక్కసారి వెలుగు చూస్తుంది. పాపం, ఎంతో రిస్క్‌ వహించి, నిత్యం ఎన్నో దుష్కర్మలకు పాల్పడతారు. జీవితమంతా నిత్య భయంతో గడచిపోతుంది. బినామీలకు రోజూ జోలాలి పాడాల్సిందే. టెక్నాలజీ పెరిగాక, ముఖ్యంగా అన్నిచోట్ల సీసీ కెమేరాలు వచ్చాక ఇబ్బందిగానే ఉంటోందని ఓ అనుభవశాలి వాపోయాడు. ఇచ్చి పుచ్చుకోవడాలు పోఖ్రాన్‌ ప్రయోగమంత కష్టంగా మారిందని మరొకాయన వ్యాఖ్యానించాడు. ఈ కథనాలను విన్నప్పుడల్లా ఆ పురుష లక్షణం గారి మీద జాలేస్తుంది. ‘‘నీకొచ్చే జీతానికి, నువ్‌ తెస్తున్న సొమ్ములకు పొంతన లేదు. ఇవన్నీ ఎక్కడివి మొగడా!’’అని ఏ ధర్మపత్నీ అడగదు. హాయిగా అనుభవించడంలో భాగస్వామి అవుతుంది.

మూడొందల డ్రెస్‌లు, నాలుగొందల జతల పాదరక్షలు, బైక్‌లు, విలాసవంతమైన కార్లు సొంతం అయినప్పుడు పిల్లలు– పాపం! నాన్నారెక్కడనించి కొట్టుకొస్తున్నారోనని ఆలోచించరు. చచ్చేంత భయంతో, టెన్షన్‌తో, దినదిన గండంగా బతుకు వెళ్లదీసేది ఆ త్యాగ పురుషుడొక్కడే! ఒకనాడు అంగుళీమాలుడు దారిదొంగ. ఎందర్నో కొట్టి చంపి తన వారందరినీ పోషించేవాడు. ఓ మహాత్ముడు తారసపడి, పాపాలకు రేపు నువ్‌ అనుభవించబోయే శిక్షలో సగం వాటా నీ అర్థాంగి స్వీకరిస్తుందేమో కనుక్కోమన్నాడు. ఆమె నిర్దాక్షిణ్యంగా నవ్వింది. అంగుళీమాలుడి తలతిరిగింది. అందుకని ఎవరింటి జవాబైనా ఇలాగే ఉంటుంది. ప్రశాంతంగా జీవించడం మేలు.     
    శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు