తెలుగు రాష్ట్రాల సఖ్యతకు దోహదం

26 Oct, 2015 01:40 IST|Sakshi

విజయదశమి రోజున ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతోపాటు తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర్‌రావు కూడా హాజరు కావడం రెండు రాష్ట్రాల ప్రయోజనాల రీత్యా హర్షించదగ్గ విషయం. తాను తీసుకువచ్చిన పార్లమెంట్ మట్టిని, యమునానది నీటిని వేదిక మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందించడం ద్వారా ప్రధాని రాష్ట్రానికి తన వంతు సహకారం ఉంటుందని సూచించారు. కానీ దాన్ని కేవలం మాటల్లో కాకుండా అక్కడి కక్కడే ప్రకటించి ఉంటే బాగుండేది. అమరావతి శంకుస్థాపన సమయంలో మోదీ హాజరుపై ఏపీ ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ప్రత్యేక హోదా లేక ప్రత్యేక ప్యాకేజీ.. రెండింటిలో దేన్నీ ప్రధాని ప్రకటించకపోవడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
 
 అలాగే ప్రధాని తమ ప్రసంగంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ కార్యాలయానికి స్వయంగా వెళ్లి సాదరంగా ఆహ్వానించిన విషయం తనకు ఎంతో సంతోషం కలిగించిందని చెప్పడం రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఆనందం కలిగించింది. పైగా ఆకార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం ప్రత్యేక అతిథిగా భావించడమేగాక తన వెన్నంటే ఉండేలా చూసి సరైన గుర్తింపు, గౌరవాన్ని కల్పించారు. తెలంగాణ సీఎం తక్కువ సేపు మాట్లాడినా అమరావతి రాజధాని అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని చెప్పడం ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యతకు ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పవచ్చు. ప్రజలు కోరుకునేది ఒకటే.. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలి. తెలుగు ప్రజలందరూ కలిసి మెలిసి జీవించాలి.    
 - కామిడి సతీష్‌రెడ్డి,పరకాల వరంగల్ జిల్లా.

మరిన్ని వార్తలు