తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకర స్థాయిలో ఊబకాయ సమస్య!

10 Nov, 2023 16:53 IST|Sakshi

జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనం

హైదరాబాద్‌సహా చిత్తూరు జిల్లా గ్రామాల్లో పరిశీలన

పిల్లల్లో లేమి.. పెద్దల్లో అధిక పోషకాలు?

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఊబకాయం, అధిక బరువు సమస్య ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. పట్టణ/నగర ప్రాంతాల్లో మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ సమస్య ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. జనాభాలోని పలు వర్గాల నుంచి సమాచారం సేకరించి జరిపిన ఈ అధ్యయనం వివరాలు అంతర్జాతీయ జర్నల్‌ ‘న్యూట్రియంట్స్‌’లో ప్రచురితమయ్యాయి.

వేర్వేరు వయసుల వారిలో పోషకాల స్థాయి, ఆ స్థాయుల్లో ఉండేందుకు గల కారణాలను ఈ అధ్యయనం ద్వారా అర్థం చేసుకున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ శుక్రవారం తెలిపింది. అధ్యయనంలో భాగంగా హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని నాలుగు గ్రామాల నుంచి  మొత్తం 10,350 మంది వ్యక్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఇందులో 8317 మంది తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన వారు.

మధుమేహం, రక్తపోటు సమస్యలూ...
నగర ప్రాంతాల్లో దాదాపు 47.7 శాతం పెద్దలు ఊబకాయంతో బాధపడుతూండగా.. 14.8 శాతం మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. పల్లెల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఊబకాయం సమస్య 46.7 శాతం ఉంది. అధికబరువు సమస్య తెలంగాణ నగర ప్రాంతాల్లో మాదిరిగానే 14.8 శాతం నమోదైంది. ఈ రెండు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో వయసు తేడా తెలంగాణలో 50.6 శాతమైతే.. ఆంధ్రప్రదేశ్‌ పల్లెల్లో 33.2 శాతం మంది ఉన్నారు. అంతేకాదు.. అధ్యయనంలో పాల్గొన్న హైదరాబాదీల్లో 11 శాతం మంది అధిక రక్తపోటు సమస్యను కూడా ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య ఆరు శాతం మాత్రమే. ఇరు ప్రాంతాల్లోనూ సమానంగా ఉన్న ఇంకో సమస్య మధుమేహం. హైదరాబాద్‌, చిత్తూరు జిల్లాలోని నాలుగు గ్రామీణ ప్రాంతాల్లోని వారిలో 5 శాతం చొప్పున మధుమేహులు ఉన్నట్లు తెలిసింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అధ్యయనంలో పాల్గొన్న 40 - 59 మధ్య వయస్కుల్లో అధికులు క్లరికల్‌ ఉద్యోగాల్లో లేదంటే కొద్దిపాటి నైపుణ్యం ఉన్న వృత్తుల్లో ఉన్నవారే. ఈ రకమైన వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్న వారికి ఇతరులతో పాలిస్తే ఊబకాయం సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ.

‘‘అధ్యయనంలో పాల్గొన్న వారు కొంతమందిలో అవసరమైన దానికంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. ఆహారం, పర్యావరణం, శారీరక శ్రమ లేకపోవడం, వంటివి ఇందుకు కారణం కావచ్చు. చాలామందిలో ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయమాల ప్రాధాన్యత కూడా తెలియదు’’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్‌ సమరసింహా రెడ్డి తెలిపారు.

‘‘నగర, గ్రామీణ ప్రాంతాల మధ్య తేడా పెద్దగా లేకపోవడం ఈ అధ్యయనంలో చాలా ఆసక్తికరమైన విషయం. పైగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఊబకాయం సమస్య ఎక్కువ ఉన్న సూచనలు కనిపించాయి.’’ అని చెప్పారు. జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.హేమలత మాట్లాడుతూ...‘‘విచిత్రమైన విషయం ఏమిటంటే.. పెద్దవాళ్లలో ఊబకాయం, అధిక బరువు సమస్యలుంటే... చిన్నవాళ్లలో పోషకాహార లేమి కనిపించడం. అది కూడా జాతీయ స్థాయి సగటుకు దగ్గరగా ఉండటం విశేషం." అని చెప్పారు.

మరిన్ని వార్తలు