ఉషా ఉతుప్ రాయని డైరీ

20 Sep, 2015 10:51 IST|Sakshi
ఉషా ఉతుప్ రాయని డైరీ

మనుషులు కదలరు. కదలాలనే ఉంటుంది. కదిలితే బాగుండనే ఉంటుంది. కానీ కదల్లేరు. ఏదైనా ఫోర్స్ వారిని కదిలించాలి. ఏ శక్తీ కదిలించకపోతే అలాగే ఆడియన్స్‌గా ఉండిపోతారు. ఎప్పటికీ! అది వాళ్లకు సంతోషం కావచ్చు. కానీ వేదికపై ఇంకో సంతోషం ఉంది. కొంచెం పై లెవల్లో. దాన్ని ఎక్కితే ఆ ఆనందం ఇంకోలా ఉంటుంది. అయితే ఎలా? వేదిక వాళ్లది కాదు కదా. వాళ్ల కోసం కోల్‌కతా నుంచో, ముంబై నుంచో, చెన్నై నుంచో వచ్చిన వాళ్లది! కానీ మ్యూజిక్.. ఆడియన్స్ కోసం వేదికపై నుంచి చేతులు చాస్తుంది.. వచ్చి వాలిపొమ్మని. ప్రేమా అంతే. తల నిమురుతూ ఒడిలోకి తీసుకుంటుంది.
 
 దటీజ్ వై.. ఐ బిలీవ్ ఇన్ మ్యూజిక్. ఐ బిలీవ్ ఇన్ లవ్. రెండూ రెండు వేర్వేరు డ్రైవింగ్ ఫోర్స్‌లు. రెండూ కలిసి సుడిగాలై వీస్తే మనిషిని పైకి లేపేస్తాయి.. గాన గాంధర్వంలోకి, ప్రేమ మాధుర్యంలోకి. సుడిగాలి వీయడం ఏమిటి! రేగుతుందేమో కదా. లేదంటే, లేస్తుంది.. సుడులు తిరుగుతూ పైపైకి. కానీ లోపల ఉన్నదేమిటి? సంగీతం కదా, ప్రేమ కదా.. అందుకే అదొక దివ్య సమ్మేళనమై మత్తుగా వీస్తుంది.
 
 డాఆఆఆఆఆఆ... ర్లింగ్... ఆంఖో సే ఆంఖో చార్ కర్నేదో... ఎవరూ కదల్లేదు! దమ్ మారో దమ్... మిత్ జాయే గమ్... ఎవరూ కదల్లేదు! ఈ హైదరాబాద్‌కి ఏమయింది! నో గ్రూవింగ్. పైకి రమ్మని అడుగుతున్నాను. ఆడియన్స్‌లోంచి ఒక అమ్మాయి లేచింది.
 
 సిగ్గు పడుతూ నిలుచుంది. ఆ అమ్మాయిని రమ్మన్నాను. నాతో కలిసి  ‘మోనీకా... ఓ మై డార్లింగ్’ అంటూ పాడాలి. నాతో పాటు హిప్స్ కదపాలి. కనీసం లిప్స్. అమ్మాయి డయాస్ పైకి వచ్చేసింది! వావ్.. దట్ ఈజ్ లౌలీ. వాళ్లాయన కింది నుంచి చూస్తున్నాడు. తినేస్తాననా? సిగ్గు తీసేస్తాననా? అమ్మాయి చెయ్యి అందుకున్నాను. కింద ఉన్న అబ్బాయి వైపు చూస్తూ అన్నాను... ‘నౌ విత్ యువర్ పర్మిషన్, ద హోల్ వరల్డ్ విల్ కాల్ యువర్ వైఫ్.. ఓ మై డార్లింగ్’.  అప్పుడొచ్చింది ఆడియన్స్‌లో కదలిక! ‘మోనీకా..’ అంటూ ఊగిపోతున్నారు. హా హ్హా హా.. సంగీతమూ, ప్రేమే కాదు, ఏ బ్యూటిఫుల్ ఉమన్ బీ ఏ క్రూన్డ్ ట్రాక్ ఆఫ్ డ్రైవింగ్ ఫోర్స్.
 
 వినడం మాని, పాడే స్టేజ్‌లోకి వచ్చింది కాన్సర్ట్. అంతా గొంతు కలుపుతున్నారు. మొత్తంగా కదలడం వీలుకాని వాళ్లు కనీసం చేతులనైనా కదిపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే కదులుతున్నారు. పాటలో అమృతం ఉంటుంది. అది తాగాలి. పాడడంలోనూ అమృతం ఉంటుంది. దాన్ని తాగమని ఇవ్వాలి? మనుషులు ఎక్కువసేపు దూరంగా ఉండిపోలేరు. పాటగానీ ప్రేమగానీ దొరికే వరకే ఆ దూరం.
- మాధవ్ శింగరాజు

మరిన్ని వార్తలు