ఈ పాక్షిక దృష్టి ప్రమాదకరం

24 Jun, 2017 02:11 IST|Sakshi
ఈ పాక్షిక దృష్టి ప్రమాదకరం

రాంనాథ్‌ కోవింద్, మీరా కుమార్‌లు దళితులైనందువల్లనే రాష్ట్రపతి పదవికి అభ్యర్థులుగా ఎంపికైనారన్నది మీడియా వాదన. వారికున్న సమర్థతల గురించిన చర్చ జరగనే లేదు. ఇద్దరూ సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నవారు, విద్యావంతులు, సమర్థులు కూడా అన్న అంశాలకు మీడియా ప్రాధాన్యత ఇవ్వకుంటే ఎలా?

రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. రాబోయే ఫలితం గురించి అనుమానాలు ఎవరికీ లేకపోయినా మరో నెల రోజులపాట ఇందుకు సంబంధించిన చర్చ మీడియాలో కొనసాగుతుంది. ఈ ఎన్నికలో రాజకీయ పక్షాల పాత్రతో పాటు మీడియా ప్రమేయం గురించి కూడా సమీక్షించుకోవాలి. రాబోయే తరం కోసం యోచన చేసే స్థాయి నుండి కేవలం రాబోవు ఎన్నికల్లో సానుకూల ఫలితాల సాధన కోసం పరితపించే స్థాయికి మన దేశ రాజకీయ రంగం ఏనాడో దిగజారింది. పార్టీల పేర్లు, జెండాలు, సిద్ధాంతాలు వేరైనా, రాజకీయ పక్షాలన్నీ కాంగ్రెస్‌ సంస్కృతిని ఒంటబట్టించుకున్నాయి. అయితే ప్రజల పక్షాన, ప్రత్యేకించి పీడితుల పక్షాన నిలచి పోరాడాల్సిన మీడియా పయనం గురించి చర్చించక తప్పదు.

స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దాదాపు 60 ఏళ్ల పాటు భారత్‌లో కాంగ్రెస్‌ ఆధిపత్యం నడిచింది. ప్రతిపక్షాలు, ప్రాంతీయ పక్షాల బలం పెరి గిన తర్వాత పోటీ అనివార్యమైంది. నెమ్మదిగా ఓటుబ్యాంకు రాజకీయ వ్యూహాలు ప్రారంభమయ్యాయి. తమ పార్టీ దళితులు, మైనారిటీల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందన్న ప్రచారాలకు తెరలెత్తాయి. ప్రస్తుతం ఇది అనివార్యమే కావచ్చు. ఈ అంశంలో మీడియా పాత్ర ఏమిటి?
సామాజిక అసమానతలను కాస్తయినా తగ్గించాలనే సంకల్పంతోనే రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. పరిపాలనలోను, దేశ ప్రగతిలోను అందరూ భాగస్వాములు కావడానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తప్పనిసరి అవుతాయన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పే బాధ్యతను మీడియా నుంచి ఆశించడం సహజం. అయితే ఆ దారిలో మీడియా పయనిస్తున్నదా?

నేటి రాష్ట్రపతి ఎన్నికనే తీసుకుందాం. ఎన్డీఏ తన అభ్యర్థిగా రాంనాథ్‌ కోవింద్‌ను ప్రకటించింది. ఎన్డీఏ నిర్ణయాన్ని కేవలం దళితులను తన అక్కున చేర్చుకొనే వ్యూహంగా మాత్రమే అధిక శాతం మీడియా అభివర్ణించింది. అంతేకాదు; కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మరో దళిత అభ్యర్థి మీరాకుమార్‌ను పోటీలోకి దించడం ద్వారా ఎన్డీఏ వ్యూహాలను దెబ్బతీసిందన్న అంశానికే మీడియా అధిక ప్రాధాన్యతను ఇచ్చింది.
రాంనాథ్‌ కోవింద్, మీరా కుమార్‌లు కేవలం దళితులైనందువల్లనే ఎంపికైనారన్నది మీడియా వాదన. వారికున్న సమర్థతల గురించిన చర్చ జరగనే లేదు. ఇద్దరూ సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నవారు, విద్యావంతులు, అత్యంత సమర్థులు కూడా అన్న అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యతను మీడియా స్వీకరించలేదు. ఇది పక్షపాత ధోరణి కాదా?

జాతీయ నాయకుల్లో సామాజిక పోరాటాలను నిర్వహించిన యోధుల్లో డాక్టర్‌ అంబేడ్కర్‌ది తప్ప మరొకరి పేరు ఎక్కడైనా కనిపిస్తుందా? ఈ మధ్య జ్యోతీరావ్‌ పూలే పేరు అక్కడక్కడా కనిపిస్తున్నది. సమత కోసం ఉద్యమించిన భాగ్యరెడ్డి వర్మ లాంటి వారు కోకొల్లలు. వెతికే దృష్టికోణం లేకనా లేక మీడియాకు మనసే కరువైనదా? ఈనెలలోనే మనలను తొలచిన వార్త డాక్టర్‌ సి నారాయణరెడ్డి మరణం. వారి రచనా వైదుష్యాన్ని, అత్యున్నత స్థాయిలో మీడియా ప్రజల ముందుంచింది. అయితే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ స్వర్గస్థులైన సందర్భంగా మీడియా ఇంతగా స్పందించిందా? గుర్రం జాషువా, భోయి భీమన్నలను సాహితీ సంస్థలు ఎలాగూ పట్టించుకోవు. కానీ మీడియాలో వీరి స్థానం ఏమిటి? ప్రజల మనస్తత్వాన్ని మలచవలసిన మీడియా తన వంతు పాత్రను పరిహరించడం ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాదం.

సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షునిగాను, జాతీయ అధ్యక్షునిగాను పనిచేసిన ప్రముఖుడు బంగారు లక్ష్మణ్‌. సిద్ధాంత స్పష్టత, యోగ్యమైన కార్యాచరణ, అర్థవంతమైన మార్గదర్శనం చేయడంలో రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఆయన అత్యంత సమర్థుడు. 20 ఏళ్లపాటు వారితో కలిసి రాజకీయ క్షేత్రంలో పనిచేసిన అనుభవంతో నేనీ విషయాన్ని చెబుతున్నాను. కానీ, వారిపై వచ్చిన అవినీతి కేసుకే మీడియా ప్రాధాన్యతనిచ్చింది. ఇంకెవరూ ఇలాంటి కేసుల్లో లేనట్లు భ్రమపడేలా, ‘రాజకీయ రంగంలో అవినీతి’ అనే అంశం వచ్చినప్పుడల్లా బంగారు లక్ష్మణ్‌ అవినీతి క్లిప్పింగును పదే పదే చూపడం ద్వారా తన దళిత వ్యతిరేకతను చూపకనే చూపింది.

ప్రముఖ జర్నలిస్టు బిలాల్‌ జైదీ ఈ నెల 21వ తేదీన తన ఫేస్‌బుక్‌ పేజీలో రాసిన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించడం అవసరం. నితిన్‌ గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఉన్న కాలంలో పార్టీ అధికార ప్రతి నిధుల్లో రాంనాథ్‌ కోవింద్‌ కూడా ఉన్నారు. వివిధ అంశాల మీద పార్టీ దృక్పథాన్ని స్పష్టంగా చెప్పగల సమర్థుడు కూడా ఆయన. అయినా మిగి లిన అధికార ప్రతినిధులైన రవిశంకర ప్రసాద్, రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ, ప్రకాశ్‌ జవదేకర్ల స్పందనల కోసమే మీడియా పాకులాడేది. పార్టీ మీడియా కో ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌ శర్మ ఎన్నో సందర్భాల్లో రాంనాథ్‌ కోవింద్‌ స్పందనను తీసుకోవాలని కోరినా, మీడియా సుముఖత చూపలేదనేది బిలాల్‌ జైదీ అభిప్రాయం. ఇలాంటి ధోరణి సామాజిక సమతకు దోహదకారేనా?

బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు విడిగా కేటాయింపులు ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నాయి. అయితే కేటాయించిన సొమ్మును సబ్‌ ప్లాన్‌ల కోసం ఖర్చుపెట్టిన దాఖలాలే కరువైనాయి. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రజా ప్రతినిధులుగా ఎంతో మంది ఎన్నికైనారు. ఎన్నికవుతున్నారు. రాజ కీయ పక్షాలు, ప్రభుత్వ యంత్రాంగాల మిలాఖత్‌తోనే ఈ అకృత్యాలు కొనసాగుతున్నాయి. స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా ఇటువంటి సంఘటనలను మీడియా ఎన్నడైనా బట్టబయలు చేసిందా?
ఆర్థిక అంతరాలు తగ్గాలని, సామాజిక అంతరాలు, ఆర్థిక పీడన అంతం కావాలని అందరం అంగీకరిస్తాం. ఈ పరిణామాలు కేవలం చట్టాలతో సాధ్యమయ్యేవి కావు. మానసిక పరిణతితో మాత్రమే ఇవి సాధ్యం. విజ్ఞులైన పౌరుల ప్రయత్నాలకు మీడియా తోడు ఉన్నప్పుడే ఈ అవలక్షణాలను అధిగమించగలుగుతాము. రాబోయే నెల రోజుల కాలంలో భారతదేశ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆరోగ్యవంతమైన చర్చ మీడియాలో జరగాలి. రాంనాథ్‌ కోవింద్, మీరాకుమార్‌ దళిత కులాల్లో పుట్టిన వారు మాత్రమే కాదు. విద్యావంతులు, మేధావులు, వివిధ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. ఉన్నత స్థాయి భారతీయ పౌరులు కూడా.

అందరి శక్తియుక్తులు సమాజ ప్రగతికి ఉపయుక్తంగా రూపొంది, ఏకోన్ముఖంగా సమాజం ముందుకు సాగడానికి మన మీడియా సంధాన కర్తగా నిలవాలి. అంతరాలు తగ్గి, నవ సమాజ నిర్మాణం దిశగా అడుగులు వేయాలంటే బాధ్యతాయుతమైన మీడియా ఈ దిశలో ముందుకు సాగక తప్పదు.

చివరిమాట: రిజర్వేషన్లు లేని ఒలింపిక్‌ క్రీడారంగంలో భారత్‌ ఎన్నవది? ఇందులో పతకాల సాధనకు ఏ అసమర్థతలు అడ్డం వచ్చాయి? అసమాన ధైర్య స్థైర్యాలతో విజయవంతంగా ఎవరెస్టును అధిరోహించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వన్నె తెచ్చిన పదకొండుమంది చిరంజీవులు ఎస్టీ, ఎస్సీలే సుమా!

 

పి.వేణుగోపాల్‌ రెడ్డి
వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్‌ చైర్మన్, మొబైల్‌ : 94904 70064

మరిన్ని వార్తలు