‘ఆవిర్భావా’నికి ఆర్భాటమేల?

1 Jun, 2015 02:05 IST|Sakshi
‘ఆవిర్భావా’నికి ఆర్భాటమేల?

హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటూ, ఉమ్మడి హైకోర్టు కొనసాగుతున్నందున తామింకా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటున్నట్లు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు నాటి మద్రాస్ ప్రభుత్వం మద్రాస్ నగరంలో ఆంధ్రులకు తాత్కాలిక రాజధానిని కూడా అనుమతించలేదు. ఏపీ ప్రభుత్వాన్ని, రాజధానిని  హైదరాబాద్ నుంచి తరలించేంత వరకు తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా మనజాలదు. ప్రథమ వార్షికోత్సవ సంబరాలకంటే సీఎం కేసీఆర్ ఈ అంశంపైనే దృష్టిపెట్టాలి.
 
 ప్రియమైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారూ,
 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రథమ వార్షికోత్సవ శుభ సందర్భంగా మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. రాష్ట్ర ఆవిర్భావంతో తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైంది. మీ విధానాల అమలుకు తోడ్పడేందుకోసం ఈ ఉత్త రంలో నా నిర్మాణాత్మక ఆలోచనలను పొందుపరుస్తున్నాను. ఎంతో నమ్ర తతో, విశ్వాసంతో నేను రాస్తున్న ఈ లేఖను మీరు ప్రత్యేక శ్రద్ధతో పరిశీ లిస్తారని ఆశిస్తున్నాను. మొదటగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంవ త్సర కాలం పూర్తి చేసుకున్నందుకు మీకు నా శుభాభినందనలు. గత ఏడాదిగా ప్రభుత్వ విధానాలు, పనితీరును సమీక్షించుకోవడానికి ఇది తగిన సమయమని నా అభిప్రాయం.
 
 తెలంగాణలోనే ఉన్నామా?
 నా మౌలిక ప్రశ్న ఏమిటంటే.. మన కలల తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధిం చుకున్నామా? మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ, వాస్తవంలో హైదరా బాద్‌లో ఒక భాగాన్ని మాత్రమే పొందాము. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంతో చిక్కల్లా ఏదంటే హైదరాబాదే. పైగా విభజన చట్టం పదేళ్లపాటు అంటే 2025 వరకు కొన్ని కీలకమైన అంశాలను తెలంగాణ ప్రభుత్వ నియంత్రణలో లేకుండా వెలుపల ఉంచినట్లు కనిపిస్తోంది. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఇది 5 ఏళ్లుగా మాత్రమే ఉండేది. కానీ ఆంధ్రా లాబీ ఢిల్లీలోని కాంగ్రెస్ నేతలపై అన్నిరకాలుగా ఒత్తిళ్లు పెట్టి పదేళ్లకు పొడిగించారు. విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఎంఐఎమ్ నేత అసదుద్దీన్ లోక్‌సభలో దీనిపై 19 సవరణలు ప్రతిపాదించారు. పైగా సోనియా వద్ద కూడా ఆయన ఈ అంశంపై చర్చకు పెట్టారు. ఆయన్ను మనం అభినందించాలి. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, టీఆరెస్ ఎంపీల పాత్ర పెద్దగా లేదని మీరు గుర్తించాలి. అదే సమయంలో అన్ని పార్టీల ఆంధ్ర ఎంపీలు, కేంద్ర ప్రభుత్వంలోని  7 గురు ఆంధ్రా మంత్రులు, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో మంత్రి వెంకయ్య నాయుడు జోక్యం వల్ల బిల్లు పూర్తిగా మారిపోయింది. దీంతో ఆంధ్ర నేతలను సంతోషపెట్టే క్రమంలో హైద్రాబాద్‌లో ఒక ముక్కను మాత్రమే మనం పొందగలిగాం. అందుకే మునుపటిలాగానే హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ కొనసాగుతోందని తెలంగాణ కార్యకర్తల్లో అభిప్రాయముంది. తాము కలలు కన్న తెలంగాణ ఇంకా రాలేదని వారు భావిస్తున్నారు.
 
 ఈ పరిస్థితుల్లో మీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఏడు రోజులపాటు  తెలంగాణ రాష్ట్ర ప్రథమ వార్షికోత్సవాన్ని సంబరంగా జరుపుకోవలసిన అవ సరం ఉందా అనే అంశాన్ని మీరు తీవ్రంగా పరిశీలించాలి. చట్టం నుంచి ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు, ఉమ్మడి గవర్నర్‌ని తొలగించినప్పుడు, గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వం, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాం టి జోక్యం లేకుండా తెలంగాణ ప్రభుత్వం స్వేచ్ఛగా పని చేసుకోవడాన్ని అనుమతించినప్పుడు మాత్రమే భారీస్థాయిలో మనం సంబరాలు జరుపుకో వచ్చన్న నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారు. ఇది మీరు పరిశీలనలోకి తీసుకోవలసిన కీలక సమస్య.
 తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో మిగులు రాష్ట్రం. కాబట్టి మరో నాలుగేళ్లపాటు మీరు దీన్ని మిగులు రాష్ట్రంగానే ఉంచాలి.
 
 గతంలో ఆంధ్ర పాలకులు చేసినట్లుగా కాకుండా మన సొంతవనరుల నుంచి వచ్చే ఆదాయం తోటే తెలంగాణను అభివృద్ధి చేయాలి. కాబట్టి ప్రభుత్వ డబ్బును వివిధ అవసరాలకు ఖర్చు పెట్టేటప్పుడు పొదుపు పాటించాల్సి ఉంది. ఇది మాత్ర మే రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రం స్థాయిలో ఉంచుతుంది. కాబట్టి మీ పరిధిలో ఉన్న శాఖలు పెడుతున్న అనుత్పాదక వ్యయాన్ని మీరు సమీక్షించాలి. ఈ విధంగానే మీ మంత్రులు తమ శాఖలతో వ్యవహరించడంలో మీరొక కొత్త ట్రెండ్‌ను ఏర్పర్చగలరు. ఈ విషయానికి సంబంధించి, ‘ప్రతి ముఖ్యమంత్రి ప్రజాధనానికి ట్రస్టీ మాత్రమే. ప్రతి రోజూ వారు భారీ ఎత్తున డబ్బును సేకరించి, ఖర్చు పెడుతుంటారు. అయితే ఆ వ్యయం పారదర్శకతతోనూ, జవాబుదారీతనంతోనూ ఉండాలి’ అంటూ మొదట్లో గాంధీజీ, తర్వాత సుప్రీంకోర్టు చేసిన సూచనను మీరు మననం చేసుకోవాలి.
 
 సమస్య మూలం హైకోర్టే
 ఇక కీలకమైన హైకోర్టు సమస్యపై మీరు తక్షణం దృష్టి సారించాలి. మరో మూడు నెలల్లో హైకోర్టు విభజనను సాధించాలి. ప్రస్తుతం హైకోర్టులోని 28 మంది జడ్జీలలో కేవలం ఆరుగురు మాత్రమే తెలంగాణకు సంబంధించిన వారు. 22 మంది ఆంధ్ర నుంచి వచ్చారు. అందుకే హైకోర్టుకు సంబం ధించినంత వరకు తామింకా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నామన్న భావనతో మన న్యాయవాదులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. పొరుగు రాష్ట్రానికి సంబంధించిన మెజారిటీ న్యాయమూర్తులు కలిగించే ప్రభావాన్ని మనం సులువుగానే అర్థం చేసుకోగలం. కాబట్టి మీ ప్రభుత్వం హైకోర్టు విభజన కోసం ఇక్కడా, ఢిల్లీలో కూడా తీవ్రంగా ప్రయత్నించాలి. రోజువారీ ప్రాతి పదికన ఈ సమస్యతో వ్యవహరిం చడానికి మీరు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పర్చాలి. పై సమస్యల పరిష్కారంలో ఇటీవలే రిటైరైన ప్రముఖ సుప్రీం కోర్టు జడ్జీలు, ఇతర న్యాయ ప్రముఖులు మీకు తోడ్పడగలరు.
 
 ఈ తరుణంలో ప్రభుత్వానికి అనుభవజ్ఞులైన విజ్ఞానఖనుల సలహా, సూచనలు ఎంతైనా అవసరం. స్వచ్చందంగా సహకరించడానికి వివిధ రంగాల్లో సమర్థులు, అనుభవజ్ఞులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎలాంటి ప్రోత్సాహకాలనూ ఆశించకుండా ప్రభుత్వానికి సేవలందించేవారున్నారు కాని వీరి సేవలందుకునే విషయంలో ఇంతవరకు ఎలాంటి ప్రయత్నమైనా జరిగిందా? ఈ సందర్భంగా 2043 ఏళ్ల క్రితం నివసించిన అలెగ్జాండర్ ది గ్రేట్ చరిత్రను మనం గుర్తు తెచ్చుకోవాలి.
 
 భారతదేశాన్ని జయించిన తొలి చక్రవర్తిగా ఈయన పేరు మన చరిత్రలో నమోదైంది. ఇంతటి ధీమంతుడికి అరిస్టాటిల్ బోధకుడిగా, సలహాదారుగా ఉండేవాడు. ఆయన పర్యవేక్షణ వల్లే అలెగ్జాండర్ గర్వం, అహంకారం నుంచి బయటపడి అనేక దేశాలను జయిం చగలిగాడు. నేటి భారత పాలకులకు కూడా ఇది చక్కటి పాఠం కాగలదు.
 
  ఈ నేపథ్యంలో 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు నాటి మద్రాస్ ప్రభుత్వం మద్రాస్ నగరంలో ఆంధ్రులకు తాత్కాలిక రాజధానిని కూడా అనుమతించని ఘటనను మీరు మననం చేసుకోవాలి. ఆ పరిస్థితుల్లోనే ఆంధ్రా నేతలు కర్నూలులో తమ సొంత రాజధానిని, ఆంధ్ర హైకోర్టును గుం టూరులోనూ ఏర్పర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిగా మద్రాసు నగరాన్ని ఉంచాలంటూ జస్టిస్ వాంచూ కమిటీ సమర్పించిన నివే దికను నెహ్రూ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
 
 అలాగే మద్రాసు నగరంలో తాత్కాలికంగా ఆంధ్రా హైకోర్టును నెలకొల్పాలంటూ వాంచూ కమిటీ చేసిన ప్రతిపాదనను కూడా నెహ్రూ ప్రభుత్వం తోసిపుచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం నాటి మద్రాస్ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గింది. మద్రాసును ఉమ్మడి రాజధానిని చేస్తే పలు సమస్యలు పుట్టుకొస్తాయని, వాటి పరిష్కా రంతో తమ సమయం వృథా అవుతుందని నాటి మద్రాస్ సీఎం సి.రాజగో పాలాచారి, ఎంపీలు పోరుపెట్టారు. కానీ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర నేతలకు అనుకూలంగా వివాదాస్పద నిర్ణయం తీసుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షలను విస్మరించాయి.  ఆ కీలక సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎలాంటి తీవ్ర నిరసనను ప్రకటిం చకుండా ఉండిపోయారు. వారు సామూహికంగా రాజీనామాలు సమర్పిం చాల్సి ఉండె. ప్రత్యేకాంధ్ర కోసం జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భంగా 1972 నవంబర్‌లో ఆంధ్రా ప్రాంతంలోని కాంగ్రెస్ మంత్రులు రాజీనామాలు సమర్పించారు. ఆ సమయంలో ఒత్తిడి వ్యూహాల ద్వారానే వారు కాంగ్రెస్ అధిష్టానాన్ని బెదిరించి మరీ తమ డిమాండ్లన్నీ సాధించుకు న్నారు. అయితే ఆంధ్ర కాంగ్రెస్ నేతల ఉదాహరణల నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎలాంటి గుణ పాఠాలు నేర్చుకోలేదు.
 
 ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు అనేవి మీ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర ప్రతిబంధకాలను కలిగిస్తాయి. ఈ పరిస్థితుల్లో దేశంలోని 28 ఇతర రాష్ట్రాలకు మల్లే తెలంగాణ ప్రభుత్వం తన రాజ్యాంగ విధులను నెరవేర్చడం చాలా కష్టం. కాబట్టి ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు అనేవి మన రాష్ట్ర రాజ్యాంగ హక్కులను అతిక్రమిస్తున్నాయి. పైగా భారత ప్రభుత్వ సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి ఇది విరుద్ధంగా ఉంటోంది. 1956 తర్వాత ఏర్పడిన రాష్ట్రా లేవీ నేడు తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలకు గురికాలేదు. కాబట్టి ఈ ఉమ్మడి ప్రహసనానికి వీలైనంత త్వరలో తెర దించాలి. ఈ ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలసికట్టుగా నిరసనలు తెలుపాలి.
 
పై కారణాల వల్ల ఆంధ్ర ప్రభుత్వాన్ని, ఆంధ్ర హైకోర్టును వారి సొంత రాష్ట్రానికి ఎంత త్వరగా పంపించాలి అనే అంశంపై మీరు కార్యాచరణను రూపొందించుకోవాలి. ఇదే మన సమస్యకు మూలం. దీన్ని పరిష్కరిస్తే ఆరు కోట్ల మంది ఆంధ్రులు, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారు. రాష్ట్ర సారథిగా మీకు నా అభినందనలు, శుభాకాంక్షలు.  (కేసీఆర్‌కు మాజీ ఎంపీ ఎం.నారాయణరెడ్డి రాసిన బహిరంగ లేఖలోని ప్రధానాంశాలు ఇవి) మొబైల్ : 7702941017 : panditnr@gmail.com)
 - ఎమ్.నారాయణ రెడ్డి

మరిన్ని వార్తలు