స్త్రీలపై హింస, అత్యాచారాలు ఇంకానా?

8 Jan, 2015 02:39 IST|Sakshi
స్త్రీలపై హింస, అత్యాచారాలు ఇంకానా?

 ఇన్ బాక్స్
 స్వతంత్ర భారతంలో వరకట్న హత్యలు, గృహహింస, అత్యాచారాలు, లైంగిక వివక్ష ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి అని ఒక స్త్రీగా, అంట రానితనాన్ని ఇంకా ఎంతకాలం భరించాలని ఒక మాదిగ కులస్తురాలిగా ప్రశ్నించిన లక్ష్మి గొంతు మూగబోయి నేటికి తొమ్మిదేళు. 1996లో ఒక మహిళగా తన వ్యక్తిగత సమస్య పరిష్కారం కోసం చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) దరిచేరిన లక్ష్మి అతి తక్కువ కాలంలోనే సంస్థ క్రియాశీల కార్యకర్త అయింది.  2004లో మార్కాపురం వద్ద పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్లో ఆమెను కాల్చి చంపారు. అప్పటికి ఆమె సీఎంఎస్ కర్నూలు జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు. కర్నూలు పట్టణంలో ఒక పక్క టైలరింగ్ వృత్తి చేసుకుంటూనే తనలాంటి బాధిత మహిళల తరఫున నిలిచింది, కళాకారిణిగా నాటికలు, పాటలతో మహిళా చైతన్యం కోసం కృషి చేసింది.
 మహిళలపై హింస, అత్యాచారాలు వ్యవస్థీకృతమవుతుండటంతో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలున్నా బాధితులకు న్యాయం జరగ డం లేదు. విశాఖజిల్లా వాకపల్లిలో 2008లో పోలీసులు గిరిజన స్త్రీలపై జరిపిన సామూహిక అత్యాచారాల నుండి ఢిల్లీలో 2011లో జ్యోతీసింగ్ పాండేపై జరిగిన అత్యాచారం వరకు అది అడుగడుగునా రుజువవుతూనే ఉంది.

నిర్భయ చట్టం వచ్చినా అత్యాచారాలు ఆగడం లేదు. 75 శాతం అత్యాచారాలు పురుషాధిక్యతను నిరూపించుకోవడానికే జరుగుతు న్నాయి. మోదీ ప్రభుత్వానికి దేశాన్ని కాషాయీకరించే తాపత్రయమే తప్ప పురుషులలోని పితృస్వామ్య భావజాలం చెత్తను ఊడ్చి పారేయ డంపై ఆసక్తిలేదు. నేటి ఏపీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మద్య నిషేధం ఎత్తేసి మహిళలకు అన్యాయం చేస్తే, తెలంగాణలో నేడు కేసీఆర్ ఆత్యాచారాలకు వ్యతిరేకంగా మాలకొండయ్య కమిషన్ వేసి చేతులు దులిపేసుకున్నారు. ఆరు నెలల పసిగుడ్డు నుండి తొంభై ఏళ్ల వృద్ధురాలి వరకు అత్యాచారాలు జరుగుతుండగా.. మహిళలు ధరించే దుస్తులే అత్యాచారాలకు కారణమనే దుష్ర్పచారంతో పురుషాధిక్యతకు సమంజ సత్వాన్ని కల్పించే ప్రయత్నాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. అశ్లీల సినిమాలను, టీవీ కార్యక్రమాలను అనుమతిస్తూ, ఇంటర్‌నెట్‌లో అశ్లీల సైట్లను నిషేధించకుండా అత్యాచారాలకు మహిళలను బాధ్యులను చేయ డం పాలక వర్గాలలోని పితృస్వామ్య భావజాలానికి నిదర్శనం. నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను గాలికి వదిలి పెట్టుబడి దారుల కొమ్ము కాస్తున్నాయి. మహిళలపై హింసకు, అత్యాచారాలకు మూలాలు వ్యవస్థలోనే ఉన్నాయని గుర్తించి నూతన ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించుకోవాలి. అదే లక్ష్మికి అర్పించగల నివాళి.
 (నేడు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో లక్ష్మి తొమ్మిదవ వర్ధంతి  సభ జరుగుతున్న సందర్భంగా)
  పి. జయ,  చైతన్య మహిళా సంఘం, రాష్ట్ర అధ్యక్షురాలు
 
 బాపూ హంతకుని విగ్రహాలా?

 దేశ దాస్య శృంఖలాలు తెంచడం కోసం యావత్ భారత జాతిని ఒక్క తాటిపై నిలిపి బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్రయోధుడు మహాత్మా గాంధీ. ఆయన చూపిన అహింసా మార్గం ప్రపంచానికే ఆదర్శనీయంగా మారింది. ఆధునిక ప్రపంచ చరిత్రలోనే అరుదైన ప్రజానేతగా గుర్తింపు పొందిన ఆ అహింసా మూర్తిని కిరాతకంగా హతమార్చిన నాథూరామ్ గాడ్సేను అఖిల భారత హిందూ మహాసభ గొప్ప దేశభక్తునిగా కీర్తించడం శోచనీయం. అంతకు మించి గాడ్సే విగ్రహాలను దేశవ్యాప్తంగా ప్రతిష్టి స్తామనడం,   అందుకు స్థలాలను కేటాయించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరడం అనుచితం, ఆక్షేపణీయం. సంఘ్ పరివార్‌కే చెందిన విశ్వహిందూ పరిషత్ చేపట్టిన పునః మత మార్పిడులతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు చోటుచేసుకుం టున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం హిందూ మహాసభ కోరికను మన్నించడమంటే హిందుత్వ ఎజెండాను అమలు చేయడానికే అది ప్రాధాన్యం ఇస్తోందని సంకేతాలను పంపడమే అవుతుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం అనాలోచితంగా గాడ్సే విగ్రహాల స్థాపనను ప్రోత్సహించి అనర్థదాయక పరిణామాలకు దారి వేయరాదని కోరుతున్నాం.
 ఎస్.వీనస్,  ఎల్.ఎన్. పురం, తూర్పుగోదావరి జిల్లా

మరిన్ని వార్తలు