వారసత్వ పార్టీలు.. అవకాశ కూటములు

14 Jan, 2019 04:46 IST|Sakshi
నాణెం విడుదల చేస్తున్న మోదీ, పక్కనే మన్మోహన్‌

ప్రతిపక్షాలపై మోదీ ధ్వజం

బీజేపీ ప్రజల సాధికారత కోసం పనిచేస్తోందని వ్యాఖ్య

తమిళ కార్యర్తలతో కాన్ఫరెన్స్‌  

చెన్నై / న్యూఢిల్లీ: జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి పేరుతో జతకట్టేందుకు యత్నిస్తున్న విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విరుచుకుపడ్డారు.  దేశానికి అన్నివిధాలుగా సేవ చేసేందుకే తాము రాజకీయాల్లోకి వచ్చామనీ, ఓటు బ్యాంకు, విభజన రాజకీయాలు చేసేందుకు కాదని వ్యాఖ్యానించారు. ‘మేరా బూత్‌–సబ్‌సే మజ్‌బూత్‌’ కార్యక్రమంలో భాగంగా తమిళనాడులోని మైలదుతురై, శివగంగ, పెరంబలూర్, తేని, విరుధునగర్‌ పార్లమెంటరీ నియోజవర్గాల్లోని బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ముచ్చటించారు.

సరికొత్త శిఖరాలకు అభివృద్ధి..
‘ఓవైపు అభివృద్ధి ఎజెండాతో మేం ఉంటే, మరోవైపు వారసత్వ పార్టీలు, అవకాశవాద పొత్తులు ఉన్నాయి. అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు  తీసుకెళ్లేందుకు 2019 లోక్‌సభ ఎన్నికలు మనకు గొప్ప అవకాశం. ‘సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌’ స్ఫూర్తితో మనం ప్రజలకు సాధికారత కల్పించేందుకు పనిచేస్తుంటే, వారసత్వ పార్టీలు మాత్రం అవకాశవాద పొత్తులతో సొంత సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాయి.  బీజేపీలో ఎదుగుదలకు ఓ కుటుంబానికి విధేయత చూపడం, గొప్ప వంశంలో పుట్టడం, ధనవంతులుగా ఉండాల్సిన పనిలేదు. కేవలం పార్టీ కోసం కష్టపడగలిగితే చాలు’ అని మోదీ తెలిపారు.

విపక్షాలవి తాత్కాలిక పొత్తులే..
ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘‘బీజేపీ విజయం ప్రతీకూల రాజకీయాలు చేసే కొందరికి ఆగ్రహం తెప్పిస్తోంది. అందుకే వాళ్లు నన్ను, పార్టీని దూషిస్తున్నారు. మన విపక్ష మిత్రులు కూడా అయోమయంలో ఉన్నారు. అందుకే ‘మోదీ చెడ్డవాడు’ ‘ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయడం లేదు’ ‘ప్రజలు బీజేపీని ఇష్టపడటం లేదు’ అని చెబుతున్నారు. కానీ మోదీ నిజంగానే చెడ్డవాడు అయితే, బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయకుంటే విపక్షాలు ఎందుకు పొత్తులు కుదుర్చుకుంటున్నాయి?’ అని ప్రశ్నించారు.   

కర్తార్‌పూర్‌ విషయంలో కాంగ్రెస్‌ విఫలం
దేశవిభజన సమయంలో సిక్కులకు పవిత్రమైన కర్తార్‌పూర్‌ సాహిబ్‌ను భారత్‌లో చేర్చడంలో కాంగ్రెస్‌ విఫలమైందని ప్రధాని మోదీ విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన కర్తార్‌పూర్‌ కారిడార్‌ వల్ల వీసా అవసరం లేకుండానే భక్తులు పాకిస్తాన్‌లోని గురునానక్‌ అంతిమ విడిదిని సందర్శించుకోవచ్చని తెలిపారు. సిక్కుల 10వ గురువు గోబింద్‌ సింగ్‌ 350వ జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో రూ.350 విలువైన వెండి స్మారక నాణేన్ని మోదీ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గురునానక్‌ 550వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, మాజీ సీజేఐ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌తో పాటు పలువురు సిక్కు నేతలు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు