రికార్డు స్థాయిలో 67.11% పోలింగ్‌

21 May, 2019 04:12 IST|Sakshi

భారత పార్లమెంటు ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికం

న్యూఢిల్లీ: సోమవారం ఉదయానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చూస్తే 67.11% పోలింగ్‌ నమోదైంది. భారత పార్లమెంటు ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికం. అయితే ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. 2019 ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగ్గా, ఓటు హక్కు కలిగిన వారి సంఖ్య దాదాపు 91 కోట్లు. 2014 ఎన్నికల్లో 66.4 పోలింగ్‌ శాతం నమోదు కాగా, 2009లో అది మరీ 56.9 శాతమే. దేశంలో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలుండగా, 542 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. తమిళనాడులోని వేల్లూరులో ధన ప్రవాహం అధికంగా ఉందనే కారణంతో ఈసీ అక్కడ ఎన్నికను రద్దు చేసింది. వేల్లూరులో తర్వాత ఎన్నిక ఎప్పుడు నిర్వహించేదీ ఈసీ ఇంకా ప్రకటించలేదు. 2014తో పోలిస్తే 2019కి ఓటర్ల సంఖ్య దాదాపు 8 కోట్లు పెరిగింది. 2019లో తొలిదశలో 69.61%, రెండో దశలో 69.44%, మూడో దశలో 68.4%, నాలుగో దశలో 65.5%, ఐదో దశలో 64.16%, ఆరో దశలో 64.4%, ఏడో దశలో 65.15% పోలింగ్‌ నమోదైంది. 2014తో పోలిస్తే మధ్యప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో పోలింగ్‌ 5 ఐదు శాతానికి పైగా పెరిగింది. చండీగఢ్‌లో 10% పైగా తగ్గింది.

మరిన్ని వార్తలు