ప్రజా విశ్వాసం పొందని ‘రాణి’

12 Dec, 2018 04:54 IST|Sakshi

రాజస్తాన్‌లో వసుంధరా రాజే స్వయం కృతాపరాధమే పార్టీ ఓటమికి దారి తీసింది. బీజేపీపై వ్యతిరేకత కంటే కూడా వసుంధరాపై ప్రజల్లో ఉన్న ఆగ్రహమే ఈ పరిస్థితికి దారి తీసింది. వసుంధరా రాజే ఈ ఎన్నికలను తన చుట్టూనే తిప్పుకున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసినా తాను ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా వంటి పథకాలే పార్టీని గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఆ అతి విశ్వాసంతోనే అధిష్టానంతో ఢీ అంటే ఢీ అంటూ తన మాటే నెగ్గేలా చూసుకున్నారు.

టిక్కెట్ల పంపిణీ దగ్గర్నుంచి ప్రచారం వరకూ అంతా తానై వ్యవహరించారు. చివరి నిమిషంలో కుల సమీకరణలపై రాజే ఆశలు పెట్టుకున్నప్పటికీ రాజ్‌పుట్‌లు, జాట్‌లు కలిసిరాలేదు. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసుకున్న అధిష్టానం 100 మంది సిట్టింగ్‌లకు టిక్కెట్లు నిరాకరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో వసుంధర రాజే మెజారిటీ సైతం బాగా తగ్గిపోయింది. యూనస్‌ ఖాన్, రాజ్‌పాల్‌ సింగ్‌ షెకావత్, అరుణ్‌ చతుర్వేది, శ్రీచంద్‌ క్రిప్‌లానీ వంటి మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు.  

సొంత పార్టీ నేతలే కలిసిరాలేదు..
అన్నదాతల ఆక్రోశాన్ని వసుంధరా రాజే సర్కార్‌ ఎన్నడూ పట్టించుకోలేదు. వారి అసంతృప్తిని చల్లార్చడానికి వీసమెత్తు ప్రయత్నం చేయలేదు. కుల సమీకరణలు అత్యంత కీలకమైన రాష్ట్రంలో ఈ సారి ఎన్నికలు రాజ్‌పుత్రులు వెర్సస్‌ రాజేగా మారిపోయాయి. రాజ్‌పుత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ ఆనందపాల్‌ సింగ్‌ ఎన్‌కౌంటర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్‌పుత్‌ నాయకుడికి అవకాశం దక్కకుండా రాజే అడ్డుకోవడం వంటివి వసుంధరపై ఆ వర్గంలో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. 

రహదారుల వెడల్పు, సుందరీకరణ అంటూ రోడ్డు పక్కనున్న చిన్న గుడుల్ని తొలగించడం, గోరక్షకుల పేరుతో జరిగిన మూకదాడులు కూడా బీజేపీపై వ్యతిరేకతను పెంచాయి. రాజే నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్న ఆరెస్సెస్‌ కూడా ఈ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పనిచేయలేదు. ఆరెస్సెస్‌ యంత్రాంగం రాజే సర్కార్‌ను గెలిపించడానికి పెద్దగా కృషి చేయలేదు. ప్రధాని మోదీ, అమిత్‌ షాలు కూడా బీజేపీని ముంచినా, తేల్చినా అందుకు రాజేదే బాధ్యత అన్నట్టుగా వదిలేశారు. మహిళా సీఎం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఆగలేదు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీలను రాజే ప్రభుత్వం నిలబెట్టుకోలేదు.  

పైలెట్‌+ గెహ్లాట్‌= కాంగ్రెస్‌ గెలుపు
బీజేపీ సర్కారుపై ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది. వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించింది. ముఖ్యంగా..అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రుణ మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఇచ్చిన హామీ బాగా పనిచేసింది. పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలెట్, మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌లు సమన్వయంతో పనిచేయడం కాంగ్రెస్‌కి ప్లస్‌ పాయింట్‌ అయింది. సీనియర్‌ నేత గెహ్లాట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో మంచి అనుబంధం ఉంది. వారిలో ఉత్సాహం నింపి కష్టించి పనిచేసేలా చేయడం లో గెహ్లాట్‌ సక్సెస్‌ అయ్యారు. ఇక సచిన్‌ పైలెట్‌ పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర్‌రవ్యాప్తంగా బలపం కట్టుకొని తిరిగారు. ఉద్యోగాలు రాక అసహనంతో ఉన్న యువ ఓటర్లను ఆకర్షించేలా సచిన్‌ వ్యూహరచన చేశారు. వారి సమష్టి కృషి కాంగ్రెస్‌ విజయానికి కారణమైంది.

కాంగ్రెస్‌కు సవాలే
రాజస్తాన్‌లో కష్టపడి సాధించుకున్న ఈ విజయం కాంగ్రెస్‌కు ఏమంత ఆశాజనకంగా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించు కోవాలన్న ఆ పార్టీ ఆశలు నెరవేరేది అనుమానంగానే మారింది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన రాష్ట్రీయ లోక్‌తంత్ర పార్టీ, భారతీయ ట్రైబల్‌ పార్టీ వంటివి గణనీయమైన ఓట్లను సంపాదించుకోవడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరమే. టిక్కెట్ల పంపిణీ సరిగా లేకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ రెబెల్స్‌ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటారు. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్‌గా మారిందని భావిస్తున్నారు. ఇప్పుడైనా సీఎంగా సరైన నేతను ఎంపిక చేయకపోతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మూల్యం చెల్లించక తప్పదనే అభిప్రాయం వినవస్తోంది.

మరిన్ని వార్తలు