మోదీకి పరువు నష్టం నోటీసులు

18 May, 2019 20:24 IST|Sakshi

కోల్‌కత్తా: ప్రధాని నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పరువు నష్టం నోటీసులు ఇచ్చారు. ప్రచారంలో భాగంగా మోదీ తనపై నిరుపణలేని ఆరోపణలు చేశారని, వ్యక్తిగతంగా తనను కించపరిచేలా మాట్లాడారని తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు. బెంగాల్‌లోని డైమండ్ హార్బర్‌లో ఈనెల 15న జరిగిన ఎన్నికల ర్యాలీలో అభిషేక్‌పై మోదీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన అభిషేక్‌ పరువునష్టం కేసు వేశారు. డైమండ్ హార్బర్ నియోజవర్గం నుంచి టీఎంసీ తరఫున అభిషేక్ బెనర్జీ పోటీచేస్తూండగా.. బీజేపీ నుంచి నీలాంజన్ రాయ్ బరిలో నిలిచారు.
 
నీలాంజన్ రాయ్ తరఫున ఈనెల 15న ప్రచారం చేసిన మోదీ, మమతా, ఆమె మేనల్లుడు పాలనను చిత్రహింసల పాలనగా పేర్కొన్నారు. ప్రజలు బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచి వారికి గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 'పశ్చిమబెంగాల్‌లో గూండాక్రసీగా డెమోక్రసీ మారింది. టీఎంసీ గూండాలు ప్రజల జీవితాలను నరకప్రాయం చేశారు. గూండాక్రసీకి త్వరలో తెరపడనుంది' అని మోదీ అన్నారు.

మరిన్ని వార్తలు