-

'ఢిల్లీ నుంచి భయపెడతాం'

28 Jul, 2019 10:29 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ సోయం బాపురావు

ఎంపీ సోయం బాపురావు

సాక్షి, భైంసా(మంచిర్యాల) : బీజేపీ కార్యకర్తలు దేనికైనా సిద్ధంగా ఉండాలని, ప్రత్యర్థి పార్టీలకు భయపడవద్దని, వారు మిమ్మల్ని భయపెడితే.. వారిని మేం ఢిల్లీ నుంచి భయపెట్టిస్తామని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు అన్నారు. శనివారం భైంసా పట్టణంలోని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ పి.రమాదేవి నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే వందకుపైగా నియోజకవర్గాలు అభివృద్ధిలో అత్యంత వెనుకబాటులో ఉన్నాయని, అందులో ముథోల్‌ నియోజకవర్గం స్థానం దయనీయంగా ఉందన్నారు.

ప్రధాని మోదీ వెనుకబడిన నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. త్వరలోనే ముథోల్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రానికి బీజేపీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

రాష్ట్రంలోనే ఏకైక ట్రిపుల్‌ ఐటీ అయిన బాసర కళాశాలలో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. బంగారు తెలంగాణలో కనీసం విద్యార్థులకు సౌకర్యాలు అందడం లేదని ఆయన విమర్శించారు. అధ్యాపకులు లేక ఇప్పటికీ విద్యార్థులకు సిలబస్‌ ప్రారంభం కాలేదని, వసతిగృహాల్లో సౌకర్యాలు లేవన్నారు. 

మున్సిపల్‌ ఎన్నికల లబ్ధి కోసమే.. 
త్వరలో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో లబ్ధికోసమే టీఆర్‌ఎస్, ఎంఐఎం నేతలు రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. ఇటీవల కరీంనగర్‌లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ చేసిన వాఖ్యలు అలాంటివేనన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో మైనార్టీలను తమవైపు తిప్పుకునే కుట్రలో భాగమేనన్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని, దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీనే గెలిపించాలన్నారు. అలాగే భైంసా మున్సిపల్‌లో జరిగిన వార్డుల విభజన, ఓటరు జాబితాలో తప్పులపై మున్సిపల్‌ కమిషనర్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఏ పార్టీకి నష్టం లేకుండా ఎన్నికల ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  

15వార్డులో పర్యటన 
పట్టణంలోని 15వ వార్డులో ఎంపీ పర్యటించి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కనీస సౌకర్యాలు లేవని, సీసీరోడ్లు, డ్రెయినేజీలు, వీధిదీపాలు లేవని, పందులు స్వైరవిహారం చేస్తున్నాయని, ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదముందన్నారు. గత మున్సిపల్‌ పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా 15వార్డు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఏడాదిలోపు కాలనీలో సమస్యలు పరిష్కరించి, మోడల్‌ కాలనీగా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.    

మరిన్ని వార్తలు