మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు బీఎస్పీ, ఎస్పీ షాక్‌!

18 Jun, 2020 14:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: రాజ్యసభ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. రాజధాని భోపాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ఈ పార్టీకి బీఎస్పీ సభ్యులు రాంబాయి సింగ్‌, సంజీవ్‌ సింగ్‌ కుశ్వాహ, ఎస్పీ సభ్యుడు రాజేశ్‌ శుక్లా సహా మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు విక్రం సింగ్‌, సురేంద్ర సింగ్‌ తదితురులు పాల్గొన్నారు. దీంతో పెద్దల సభలో కనీసం రెండు సీట్లు గెలుచుకోవాలన్న మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కాగా కరోనా కారణంగా నిలిచిపోయిన రాజ్యసభలోని 18 స్థానాలతోపాటు మరో 6 సీట్లకు శుక్రవారం(జూన్‌ 19న)ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. (పెద్దల పోరు : ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్లు!)

ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని 3 స్థానాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 107 మంది సొంత ఎమ్మెల్యేలు కలిగి ఉన్న బీజేపీ జ్యోతిరాదిత్య సింధియాను రాజ్యసభకు నామినేట్‌ చేయగా.. 91 మంది శాసన సభ్యులు కలిగిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు అవకాశమిచ్చింది. అసెంబ్లీలో మెజారిటీ ప్రకారం.. వీరిద్దరి గెలుపు దాదాపు ఖాయమైన నేపథ్యంలో మిత్రపక్షాలు(ఎస్పీ, బీఎస్సీ), స్వతంత్రుల సహాయంతో మూడో స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ పావులు కదిపింది. ఈ నేపథ్యంలో బుధవారం సమావేశం ఏర్పాటు చేయగా.. ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీ ఏర్పాటు చేసిన విందుకు హాజరై హ్యాండ్‌ ఇచ్చారు. వీరితో పాటు పలువురు సొంత ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌ మీటింగ్‌కు గైర్హాజరుకావడం గమనార్హం. దళిత నేత, రాజ్యసభ అభ్యర్థి ఫూల్‌సింగ్‌ బరైయాకు మొదటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే వీరంతా సమావేశానికి డుమ్మా కొట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ తరఫున మరో అభ్యర్థిగా ఆరెస్సెస్‌ మూలాలు ఉన్న సుమర్‌ సింగ్‌ సోలంకి(ట్రైబల్‌ కమ్యూనిటీ) బరిలో దిగిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు