‘కొత్త ప్రధాని ఖాయం.. మా నాన్నైతే కాదు’

2 May, 2019 13:52 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మహాఘట్‌ బంధన్‌ దేశానికి కొత్త ప్రధానిని ఇచ్చి తీరుతుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటైన కూటముల్లో ప్రధాని పదవి కోసం ఒక్కో నాయకుడు ఉండగా.. బీజేపీ మాత్రం ఒక్క నాయకుడి పైనే ఆశలు పెట్టుకుని ఉందన్నారు. ఫలితాల్లో సీట్ల లెక్క తేలాక తమ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరో చెబుతామని వెల్లడించారు.  తన తండ్రి ములాయం సింగ్‌ మాత్రం ప్రధాని అయితే బాగుంటుందని.. అయితే ప్రస్తుతానికి ఆయన పదవి రేసులో లేరని స్పష్టం చేశారు. వీలైనంత ఎక్కువ మంది అభ్యర్థులను గెలిపించుకోవడమే తన ముందున్న లక్ష్యమని.. తద్వారా కేంద్ర ప్రభుత్వంలో భాగమవుతామని పేర్కొన్నారు. అదే విధంగా 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించడంపై దృష్టిసారించానని తెలిపారు.

ఆమె గెలిచినప్పుడే..
బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఎస్పీ-బీఎస్పీ కూటమిగా ఏర్పడ్డాయని అఖిలేశ్‌ పేర్కొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ విషయంలో కూడా తాము ఇదే పంథా అనుసరిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోకుండా ఇతర పార్టీ నాయకులపై విమర్శలు చేయడం చూస్తుంటే బీజేపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకుందనే విషయం అర్థమవుతోందన్నారు. తమపై ఎవరూ ఆధిపత్యం ప్రదర్శించలేరని, ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న తమను గెలిపించాలని ఓటర్లకు విఙ్ఞప్తి చేశారు. ఇక తన భార్య డింపుల్‌ యాదవ్‌ కేంద్ర మంత్రి అవుతారా అన్న ప్రశ్నకు బదులుగా...ముందుగా ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు