దశలవారీగా మద్య నిషేధం

19 Nov, 2017 01:06 IST|Sakshi
కోవెలకుంట్ల మండలం కంపమల్లమెట్ట వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అధికారంలోకి వస్తే అమలు చేస్తాం.. మహిళలకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హామీ

ఏడాది ఓపిక పడితే చంద్రబాబు పాలన తప్పుతుంది

అన్న వస్తున్నాడన్న భరోసాతో ఉండండి 

కర్నూలు (కొండారెడ్డిఫోర్టు)/కోవెలకుంట్ల: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. మరో ఏడాది ఓపిక పడితే చంద్రబాబు పాలన రాష్ట్రానికి తప్పుతుందని, మనం అధికారంలోకి రాగానే అన్ని వర్గాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజాసంకల్ప యాత్ర 11వ రోజు శనివారం కర్నూలు జిల్లా దొర్నిపాడు వద్ద ప్రారంభమైంది. బస చేసిన ప్రాంతం నుంచి కంపమల్లమెట్ట వరకు జనం పోటెత్తడంతో రెండు కిలోమీటర్ల దూరం రావడానికి వైఎస్‌ జగన్‌కు దాదాపు నాలుగున్నర గంటలు పట్టింది. కంపమల్లమెట్ట నుంచి ఉయ్యాలవాడ క్రాస్, పేరా బిల్డింగ్స్, కోవెలకుంట్ల వరకు దారి పొడవునా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. పొలాల్లో పని చేస్తున్న కూలీలు తమ సమస్యలను ఆయనతో చెప్పుకోవడానికి వచ్చారు. మద్యం రక్కసి వల్ల తమ కుటుంబాలు సర్వనాశనమవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చౌక ధరల దుకాణాల్లో బియ్యం మాత్రమే ఇస్తున్నారని, ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు గాను కూలీ డబ్బులు ఇంకా రావడం లేదని, ఇళ్లు లేక గుడిసెల్లో ఉంటున్నామని.. ఇలా తమ సమస్యలను చెప్పుకున్నారు. జగన్‌ స్పందిస్తూ.. అన్న వస్తున్నాడన్న భరోసాతో ఉండాలంటూ ధైర్యం చెప్పారు. 

చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అన్ని వర్గాల ప్రజలకు లేనిపోని హామీలిచ్చి ముఖ్యమంత్రి అయ్యాక చేసిన మోసాలు, అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించేందుకే ప్రజాసంకల్ప యాత్ర చేపట్టినట్లు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్‌ వయసును 45 ఏళ్లకు తగ్గిస్తామని, రూ.2 వేల చొప్పున పింఛన్‌ అందజేస్తామని పేర్కొన్నారు. పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా కోసం ప్రార్థించాలని సూచించారు. 

డ్వాక్రా అక్కాచెల్లెమ్మల చేతికే రుణం సొమ్ము  
బ్యాంకుల్లో ఉన్న డ్వాక్రా రుణాలను వైఎస్సార్‌సీపీ అధికారం లోకి వచ్చాక నాలుగు విడతల్లో అందజేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు భరోసా ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్ర దొర్నిపాడు సమీపం నుంచి కోవెల కుంట్ల మండలానికి చేరుకుంటుండగా దారిపొడవునా పత్తి పొలాల్లో పనికి వెళ్తున్న కూలీలు, మహిళలు జగన్‌ను కలిశారు. ఆయన వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. బ్యాంకుల్లో రుణాలు మాఫీ అయ్యాయా? బంగారం ఇంటికి వచ్చిందా? అని అడిగారు. రుణాలు మాఫీ కాలేదని, బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారం ఇంటికి రాలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు రూ.40 వేలు గానీ.. రూ.లక్ష గానీ నాలుగు విడతలుగా మహిళల చేతికే ఇస్తామని జగన్‌ స్పష్టం చేశారు. బ్యాంకుల్లోని బంగారం నేరుగా ఇంటికే వస్తుందన్నారు. 

అమ్మఒడి పథకం అమలు చేస్తాం..
పిల్లలను ఉన్నత చదువులు చదివించి, ప్రయోజకులను చేయాలని మహిళలకు వైఎస్‌ జగన్‌ సూచించారు. డాక్టర్లుగానో, ఇంజినీర్లుగానో చేస్తే వారి బతుకులు మారిపోతాయన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇద్దరు పిల్లలను చదివించే తల్లులకు అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామన్నారు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్‌ ఇస్తామని చెప్పారు. ఇళ్లు లేని నిరుపేదలం దరికీ ఇళ్లు కట్టిస్తా మన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అందరినీ మోసం చేశారని ధ్వజమెత్తారు. 

మరిన్ని వార్తలు