పవన్‌.. మీకు రాష్ట్ర సమస్యలపై అవగాహన ఉందా?

29 Jul, 2018 03:01 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని ధ్వజం

నాలుగేళ్లు టీడీపీని వెనకేసుకొచ్చి ఇప్పుడు జగన్‌పై విమర్శలా?

టీడీపీకి మిత్రుడిగా ఉండి నాలుగేళ్లలో ఒక్క సమస్య అయినా పరిష్కరించారా?

హోదా కోసం ఏం చేశావో చెప్పు?

వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్నప్పుడు ఎందుకు మొహం చాటేశావ్‌?

కోట్లాది మంది ఆరాధ్య దైవం దివంగత వైఎస్సార్‌ గురించి మీరు ఎంత అసభ్యంగా మాట్లాడారో గుర్తు చేసుకోండి

ఉన్న విషయాలు మాట్లాడితే ఉలికిపాటు ఎందుకు పవన్‌?

చేయాల్సిందంతా చేసి బుద్ధ భగవాన్‌లా ప్రవచనాలు చెప్తారా?

ఇప్పటివరకూ తుందుర్రు ఎందుకు వెళ్లలేదు?   

జనసేన అధినేత పవన్‌కు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని ప్రశ్న

సాక్షి ప్రతినిధి, ఏలూరు: జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంపై అవగాహన లేక మాట్లాడుతున్నారా? లేక తెలిసే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారా అనేది అర్థం కావడం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, ఏలూరు పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు∙ఆళ్ల నాని అన్నారు. శనివారం ఏలూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లు టీడీపీకి అండగా ఉండి ఇప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.  టీడీపీకి అండగా నిలబడుతూనే ప్రజలను మభ్యపెట్టేందుకు పవన్‌ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.

ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గురించి పవన్‌ పదేపదే మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. భీమవరంలో సమస్యలపై చర్చకు రావాలంటూ వైఎస్‌ జగన్‌కు సవాల్‌ విసరడం పవన్‌ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. నాలుగు రోజులుగా భీమవరంలోనే ఉన్న పవన్‌ ఒక్కసారి కూడా తుందుర్రు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. తుందుర్రు పోరాట కమిటీ ఎన్నిసార్లు తమ గోడు వెళ్లబోసుకున్నా ఇంతవరకూ ఆ గ్రామం వెళ్లని పవన్‌కు వైఎస్‌ జగన్‌ను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు.

తుందుర్రు ఆక్వా పార్క్‌ విషయంలో ప్రభుత్వ అరాచకాలకు అడ్డం పడుతూ బాధితులకు అండగా నిలిచిందీ, తుందుర్రు వచ్చి భరోసా ఇచ్చిందే.. వైఎస్‌ జగన్‌ అని గుర్తు చేశారు. అసెంబ్లీలో కూడా ఆ సమస్యను ప్రస్తావించారని, ఉద్యమకారులపై పోలీసుల అణచివేతను ఖండించారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఆ పార్క్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తానని కూడా చెప్పారని గుర్తు చేశారు. మొగల్తూరు ఆక్వా పరిశ్రమలో యాజమాన్య నిర్లక్ష్య ధోరణి కారణంగా ఆరుగురు మరణిస్తే వెంటనే అసెంబ్లీ నుంచి వచ్చి బాధితులకు అండగా నిలబడ్డారని తెలిపారు. మార్చి 31న అసెంబ్లీలో ఆక్వా పార్కుపై తన అభిప్రాయాన్ని వైఎస్‌ జగన్‌ స్పష్టంగా తెలియచేశారని చెప్పారు.

ఆక్వా పార్క్‌ పోరాట కమిటీ సభ్యులు ఎన్నోసార్లు పవన్‌ వద్దకు వచ్చి సమస్య చెప్పుకుంటే వారిని పట్టించుకోలేదని మండిపడ్డారు. పైగా తానొస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని, చంద్రబాబుతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానంటూ పవన్‌ తప్పించుకున్నారన్నారు. ఇప్పుడు కొత్తగా సైంటిస్టులతో అధ్యయనం చేయిస్తానంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా ఎన్నాళ్లు బాధితులను మోసం చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైఎస్‌ జగన్‌పై బురద జల్లాలనే వైఖరిని పక్కన పెట్టి సమస్యల పరిష్కారానికి సిద్ధం కావాలని కోరారు. తాను ప్రతిపక్ష నేతగా ఉంటే ఉద్ధరించేవాడినని పవన్‌ చెబుతున్నారని, పవన్‌కు 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిని కూడా చంద్రబాబు కొనేసి ఉండేవాడన్నారు.

ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు
ప్రత్యేక హోదాపై ఎంపీ అవంతి శ్రీనివాస్‌ రాజీనామా చేస్తే ఆయన్ను గెలిపిస్తామని పవన్‌ చెప్పారని, అలాగే ఎంపీలను కూడగట్టి హోదా కోసం పోరాడతానంటూ ప్రగల్భాలు పలికారని, మరి వైఎస్సార్‌సీపీ ఎంపీలు పదవులను త్యజించి ఢిల్లీలో ఆమరణ దీక్ష చేసినప్పుడు పవన్‌ ఎందుకు మొహం చాటేశారని విమర్శించారు. టీడీపీ, బీజేపీ ఒక్కటై హోదాను తుంగలో తొక్కితే జగన్‌ ఒక్కరే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా పవన్‌ చిత్తశుద్ధి, నిజాయతీ, అవగాహనతో మాట్లాడాలని హితవు పలికారు. పవన్‌ మాట్లాడితే రాజకీయం, జగన్‌ మాట్లాడితే వ్యక్తిగతమా అని ప్రశ్నించారు.

చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడకూడదన్న సంస్కారం లేకుండా దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడారో గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. వైఎస్సార్‌ కుటుంబంలోని మహిళపై అసభ్య పదజాలంతో సోషల్‌ మీడియాలో కామెంట్లు చేయించారని, 48 గంటల తర్వాత అలాంటి పనులు చేయొద్దంటూ బుద్ధ భగవాన్‌లా ప్రవచనాలు చెప్పడం పవన్‌కే చెల్లిందన్నారు. జగన్‌ను అక్రమంగా అరెస్టు చేస్తే మూడువేల కిలోమీటర్ల పాదయాత్రను ప్రపంచంలో ఏ మహిళా చేయని విధంగా చేస్తే ఆ మహిళను అసభ్యపదజాలంతో, ఎంతగా అసత్య ప్రచారం చేశారో పవన్‌ చూడలేదా అని ప్రశ్నించారు.

ఉన్న విషయాల గురించి మాట్లాడితే ఒక మగాడిగా పవన్‌ బాధపడ్డారని, మరి ఒక మహిళ గురించి కామెంట్లు చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. ఫ్యాక్షనిజం గురించి పవన్‌ మాట్లాడుతున్నారని, రాష్ట్ర హోంమంత్రి నియోజకవర్గంలో ఆరు హత్యలు జరిగితే ఎందుకు స్పందించడం లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో మహిళా ఎంఆర్‌వోపై దాడి చేసినవారు ఒకరైతే, హత్యలు ప్రోత్సహించేవారు మరొకరు, ఇసుక దోపిడీ చేసేవారు మరొకరు ఉన్నారని, వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.


దమ్ముంటే చర్చకు రండి
పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చర్చకు రావాలని పవన్‌ డిమాండ్‌ చేస్తున్నారని, అయితే ప్రతిపక్ష నేతకు ఈ విషయంతో ఏం సంబంధం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి బీజం వేసింది దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని అన్నారు. జిల్లా అభివృద్ధిపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని దమ్ముంటే పవన్, జనసేన నేతలు చర్చకు రావాలని నాని సవాల్‌ విసిరారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి జిల్లాకు చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు పునాదిరాయి వేసింది మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాదా అని ప్రశ్నించారు.టీడీపీ నేతలను వెనకేసుకొస్తూ తమ పార్టీని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబుకి ఏ సమస్య వచ్చినా స్పందించడమే తప్ప నాలుగేళ్లు అధికార పార్టీకి మిత్రుడిగా ఉండి ఏ సమస్యను పరిష్కరించారో చెప్పాలని పవన్‌ను నిలదీశారు. గతంలో వైఎస్సార్‌సీపీ బృందం పోలవరం పర్యటిస్తుందని తెలియగానే హడావిడిగా పవన్‌కల్యాణ్‌ పోలవరం వచ్చి వెళ్లారని, ఆ తర్వాత పోలవరం అవినీతి గురించి ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు.

జగన్‌ అసెంబ్లీ నుంచి పారిపోయారని అంటున్నారని, జగన్‌ తుందుర్రు ఆక్వా పార్కుతోపాటు పలు భూసేకరణ సమస్యలను అసెంబ్లీలో ఎలుగెత్తి చాటుతుంటే స్పీకర్‌ ఆయన మైక్‌ కట్‌ చేయడం, ప్రతిపక్ష నేతన్న గౌరవం లేకుండా ఎవరో ఒక ఎమ్మెల్యేతోనో, మంత్రితోనో జగన్‌పై విమర్శలు చేయించడం, ఏ సమస్యనూ ప్రస్తావించకుండా అడ్డుకోవడం అందరూ చూశారన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, నగదు ఎరవేసి ఏవిధంగా టీడీపీలోకి తీసుకున్నారో ప్రజలందరూ గమనించారన్నారు. దీంతో ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడమే సమంజసమని వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు