దళితులే నిర్ణయాత్మకం!

2 Nov, 2018 04:06 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌లో 10 ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాలు

దాదాపు 40 చోట్ల దళిత ఓట్ల ప్రభావం

బీజేపీ, కాంగ్రెస్‌కు చిక్కులు?

కీలకం కానున్న జోగి, మాయావతి కూటమి!  

ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ మధ్యే హోరాహోరీ పోరు ఉంటుందని భావించినప్పటికీ.. ఛత్తీస్‌గఢ్‌ జనతా కాంగ్రెస్‌ అధినేత అజిత్‌ జోగి బీఎస్పీతో జతకట్టడంతో రాజకీయ ముఖచిత్రం మారింది.

ఛత్తీస్‌గఢ్‌లో దళితుల ఓట్లు రానున్న ప్రభుత్వాన్ని నిర్దేశించనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 90 నియోజకవర్గాల్లో 10 ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాలుండగా.. మరో 40 చోట్ల దళితులు నిర్ణాయాత్మక ఓటుగా ఉన్నారు. జోగి, మాయావతిల కూటమిలో సీపీఎం కూడా చేరింది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో ఉన్న 12% దళితుల ఓట్లను బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలు పంచుకుంటూ ఉండేవి. ఇందులో బీఎస్పీ వాటా ఎక్కువగా ఉండేది. అయితే బీఎస్పీతో జతకట్టడంతో ఈ ఓటుబ్యాంకును పూర్తిగా తమ కూటమికి అనుకూలంగా మార్చుకోవాలని జోగి వ్యూహం.

కనీసం 13 స్థానాల్లో..
జోగీ, మాయావతి కూటమి ఈ ఎన్నికల్లో కనీసం 13 స్థానాల్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. దళితుల ప్రభావం ఎక్కువగా ఉండే.. జాంగీర్‌ చంపా, బిలాస్‌పూర్‌ ఎంపీ నియోజవర్గాల పరిధిలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనేది వీరి వ్యూహం. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం రాజకీయ జీవితం (1984లో జంగీర్‌ చంపా నుంచే గెలిచారు) ప్రారంభించింది కూడా ఈ ప్రాంతంలోనే కావడంతో.. మాయావతి భారీ అంచనాలు పెట్టుకున్నారు.

2013లో బీఎస్పీ 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి ఒక్కచోట కూడా గెలుపొందలేదు. రెండు స్థానాల్లో సెకండ్‌ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. మరోవైపు, ఈసారి అకల్తారా ప్రాంతం నుంచి అజిత్‌ జోగి కోడలు రీచా జోగి బీఎస్పీ టికెట్‌పై పోటీచేస్తున్నారు. ‘మా హృదయాలు ఒక్కటవ్వాలంటే నేను బీఎస్పీ టికెట్‌పై పోటీచేయడమే సరైన నిర్ణయం. అలాగైతేనే దళిత ఓట్లు సంపూర్ణంగా బదిలీ అవుతాయి’ అని రీచా భర్త అమిత్‌ జోగి పేర్కొన్నారు.  

బీఎస్పీ బలమేంటి?
యూపీలో జాటవ్స్‌ లాగే ఛత్తీస్‌గఢ్‌లో సత్నామీలు బీఎస్పీకి అత్యంత నమ్మకంగా ఉంటారు. అయితే రాష్ట్రంలో బీఎస్పీ అభ్యర్థులు బలంగా లేనందున.. ఈ వర్గం మొదట్నుంచీ కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీ వ్యూహాత్మకంగా.. సత్నామీల గురువు బాల్‌ దాస్‌తో ‘సత్నామీ సేన’ పార్టీని పెట్టించి ఈ వర్గం ఓట్లును భారీగా చీల్చి  10 రిజర్వ్‌డ్‌ స్థానాల్లో తొమ్మిదింటిని కైవసం చేసుకుంది. ఇప్పుడు నేరుగా మాయావతే రంగంలోకి దిగడంతో ఈ స్థానాల్లో బీఎస్పీ పట్టు సంపాదించవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

దీనికితోడు ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో బీజేపీపై వ్యతిరేకత పెరిగింది. అయితే ఈ వ్యతిరేక ఓట్లు కూటమిలోని మిగిలిన పార్టీలకు బదిలీ అవుతాయా? లేదా? అన్నదే ఆసక్తికరం. బీజేపీపై వ్యతిరేకత తమకే లాభిస్తుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. దళిత ఓట్లు చీలితే మళ్లీ బీజేపీయే గెలుస్తుంది కాబట్టి.. వారంతా తమవెంటే ఉంటారని ప్రచారం చేసుకుంటోంది. బీజేపీ, కాంగ్రెస్‌ ఓట్ల శాతంలో ఉండే స్వల్ప మార్పును జోగి, మాయావతి కూటమి తీవ్రంగా ప్రభావితం చేయనుందనేది సుస్పష్టం.

మరిన్ని వార్తలు