‘సీబీఐ అంటే చంద్రబాబుకు వణుకు’

16 Nov, 2018 13:57 IST|Sakshi

విజయవాడ: కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ రాష్ట్రంలో విచారణ చేపట్టే అధికారాల్ని నిరాకరిస్తూ ఆంధ్రప‍్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సీబీఐ దర్యాప్తును అడ్డుకోవడానికి కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి థర్డ్‌ పార్టీ విచారణ చేయించాలని రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిని కలిశామని, ఈ దశలోనే చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలోకి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు.

శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు.. జగన్‌పై హత్యాయత్నం వెనుక కర్మ, కర్త, క్రియా అన్నీ చంద్రబాబేనన్నారు. అందుకే సీబీఐ అంటే చంద్రబాబు వణికిపోతున్నారన్నారు. ఆపరేషన్‌ గరుడపై విచారణకు ఎందుకు ఆదేశించరని ఈ సందర్భంగా అంబటి ప్రశ్నించారు. ఇప్పటివరకూ ఏనాడు విచారణను ఎదుర్కోని చంద‍్రబాబు.. వేల కోట్లు దోచుకున్నారన్నారు. దాంతోనే సీబీఐ విచారణ అంటే భయపడుతున్నారన్నారు. ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని అంబటి సవాల్‌ విసిరారు. ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా చట్టానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని, వ్యవస్థలను గౌరవించలేని వ్యక్తి పదవిలో కొనసాగడం అవసరమా? అని అంబటి నిలదీశారు. 

ఇక్కడ చదవండి: ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ

మరిన్ని వార్తలు