‘చంద్రబాబుకు అంత దమ్ము, ధైర్యం లేవు’

25 May, 2018 14:54 IST|Sakshi

సాక్షి, విజయవాడ : అధికారం కోసం ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ఏపీ చంద్రబాబుకే అలవాటేనని, ఎందుకంటే 46 ఉప ఎన్నికలకు సింగిల్‌గా వెళ్లి చిత్తుగా ఓడిపోయారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాంబు అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని విజయం సాధించారని, కానీ ఇప్పుడు అవే పార్టీలు చంద్రబాబు తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో శుక్రవారం అంబటి మీడియాతో మాట్లాడారు. 

‘కొత్త పొత్తుల కోసం ప్రస్తుతం చంద్రబాబు వెంపర్లాడుడుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎక్కువగా ఏదో ఓ పార్టీతో పొత్తుతోనే విజయాలు సాధిస్తోంది. సింగిల్‌గా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేని వ్యక్తి చంద్రబాబు. అందుకే 1999, 2004 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. 2009లో వామపక్షాలు, టీఆర్‌ఎస్‌తో, తిరిగి 2014 ఎన్నికల్లో బీజేపీతో మళ్లీ జత కట్టడం నిజం కాదా. అధికారం కోసం ఏ గడ్డి అయినా కరవడం చంద్రబాబుకు అలవాటే. దేశంలో ఏ పార్టీతోనూ చంద్రబాబు నిజాయితీగా పొత్తు పెట్టుకోలేదు. చంద్రబాబుతో కలిసే ఏ పార్టీ అయినా మసి అవ్వాల్సిందే. చంద్రబాబు తన అవినీతి మకిలిని పొత్తు పెట్టుకున్న పార్టీకి, నేతలకు అంటిస్తారు.

చంద్రబాబు ఎంత గగ్గోలు పెట్టినా ఆయనతో ఎవరూ కలవరు. జూన్‌ 2 నుంచి 8 వరకు నవనిర్మాణ దీక్షలు చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు. తన ప్రసంగాలతో ప్రజలకు సుత్తి కొట్టడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారింది. నవ నిర్మాణ దీక్ష ఎందుకు? అసలు రాజధానిలో ఏం నిర్మించారు. మీరు సాధించిన అభివృద్ధి ఏంటి. ప్రజలను మభ్య పెట్టడానికే మీ నవ నిర్మాణ దీక్షలు. చంద్రబాబు నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో అబద్దాలపై అబద్దాలు చెప్పడం మాత్రమే అలవాటు అయిందంటూ’ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

అన్నీ అమ్ముకున్నారు
ఇసుక, మట్టి, రాజధాని భూములను అమ్ముకున్నారు. ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ కలిసి చౌక ధర దుకాణాలకు సరుకులు అందిస్తాయని ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఫ్యూచర్ గ్రూప్ చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌లో వాటాలు కలిగి వుంది. ఇంకా పాలన చేయడానికి చంద్రబాబుకు ఏడాది సమయం ఉంది. కనీసం ఇప్పుడయినా ప్రజల కోసం చంద్రబాబు పనిచేస్తే మంచిది. కులం‌ పేరుతో అందరినీ విభజిస్తున్నారు. చివరకు దేవుడికి కూడా కులం ఆపాదిస్తారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు