ప్రతిపక్ష నేతల కాల్స్‌ ట్యాపింగ్‌

22 Mar, 2019 02:22 IST|Sakshi

యూరప్‌ నుంచి ప్రత్యేక పరికరాలు దిగుమతి

ఎన్నికల సమయంలోప్రతిపక్ష నేతలపై దుష్ప్రచారానికి  చంద్రబాబు ఎత్తుగడ

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయం, ఉద్యోగుల తరలింపు

వేమూరి హరిప్రసాద్, ఐటీ గ్రిడ్స్‌ అశోక్‌ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం 

వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్ల సమాచారం సేకరణలో నిమగ్నం 

వారి బ్యాంకు అకౌంట్లు, ఇతర వివరాల కోసం అన్వేషణ 

వివరాలు ఎప్పటికప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లకు అందజేస్తున్న వైనం 

ఇప్పటికే సీసీ కెమెరాలు, ఆర్టీజీఎస్‌తో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు, నేతలపై నిఘా 

అధికార దుర్వినియోగం, కోడ్‌ ఉల్లంఘనలను పట్టించుకోని ఎన్నికల అధికారులు

టీడీపీ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలే లక్ష్యంగా ముఖ్యమంత్రి, లోకేశ్‌తో పాటు కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అధికార దుర్వినియోగంతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాల ద్వారా ఆర్టీజీఎస్‌ (రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ) వ్యవస్థతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో పాటు పార్టీ ముఖ్యనేతలపై నిఘా పెట్టిన ముఖ్యమంత్రి.. తాజాగా వారి వాట్సాప్‌ ఫోన్లను ట్యాప్‌ చేయిస్తున్నారు. వాట్సాప్‌ కాల్స్‌ ట్యాపింగ్‌ కోసం ప్రత్యేకంగా యూరప్‌ నుంచి సూక్ష్మ పరికరాలను తెప్పించారు.  ఫోన్‌ ట్యాపింగ్‌లు, ప్రతిపక్ష అభ్యర్థుల కదలికలపై నిఘా ద్వారా సమాచారం సేకరించి.. ఎన్నికల ముందు ప్రతిపక్షంపై దుష్ప్రచారం చేసేందుకు చంద్రబాబు ఈ విధమైన అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ట్యాపింగ్‌ ఈ విషయాన్ని అధికార వర్గాలతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలే వెల్లడిస్తున్నారు.

ఎన్నికల సంఘం వద్ద ఉండాల్సిన ఓటర్ల కలర్‌ ఫొటోలతో కూడిన మాస్టర్‌ జాబితాను దొంగలించడమే కాకుండా ప్రభుత్వ సాధికార సర్వే ద్వారా రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు ఇచ్చి, దానిద్వారా ఆ సమాచారాన్ని టీడీపీ సేవా మిత్ర యాప్‌కు ఇస్తూ ప్రభుత్వం, ఐటీ గ్రిడ్స్‌ దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ గ్రిడ్స్‌ కార్యకలాపాలను ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలించారు. విజయవాడ ఆటోనగర్‌లో ఐటీ కంపెనీలున్న భవనంలోని ఒక అంతస్తులో ఈ సంస్థను ఏర్పాటుచేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు.. గతంలో ఈవీఎంలు టాంపరింగ్‌ చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి దొరికిపోయిన చంద్రబాబు సన్నిహితుడు, బినామీ అయిన వేమూరి హరిప్రసాద్, పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ సీఈవో అశోక్‌లు విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు, ప్రభుత్వ లబ్ధిదారుల వివరాల సేకరణతో ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి చేకూర్చే ఎత్తుగడలను సాగిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ ఐటీ గ్రిడ్స్‌లో పనిచేసే ఉద్యోగులను విజయవాడకు తరలించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎవరితో ఏమి మాట్లాడుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడ ఉన్నారనే వివరాలను సీసీ కెమెరాల ద్వారా ఇప్పటికే ఆర్టీజీఎస్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ముఖ్యనేతల వాట్సాప్‌ కాల్స్‌ ట్యాపింగ్‌కు సైతం వారు పాల్పడుతున్నారు.

యూరప్‌ నుంచి అధునాతన పరికరాలు
ఇందుకోసం ప్రత్యేకంగా యూరప్‌ నుంచి సూక్ష్మ పరికరాలను తీసుకువచ్చారని అధికార పార్టీకి చెందిన ఒక నేత వెల్లడించారు. ఒకసారి వాయిస్‌ రికార్డు చేస్తే ఫోను మార్చి మాట్లాడినా ఆ వాయిస్‌ను రికార్డు చేసే టెక్నాలజీ ఆ పరికరాలకు ఉన్నట్టు సమాచారం. అలాగే సెల్‌ ఫోన్‌ నంబర్‌ తెలుసుకోవడం ద్వారా, అలాగే సెల్‌ఫోన్‌ తయారీ నంబర్‌ ద్వారా ట్యాపింగ్‌ కార్యకలాపాలు సాగిస్తున్నారని, ఈ వ్యవహారం అంతా హరిప్రసాద్, అశోక్‌ కనుసన్నల్లోనే జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత రెండురోజులుగా వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్ల సమాచారం సేకరణ పనిలో నిమగ్నమయ్యారని, వారి ఫోన్‌ నంబర్లతో పాటు వారి బ్యాంకు అకౌంట్ల కోసం అన్వేషిస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం నుంచి పార్టీ సేవా మిత్ర యాప్‌కు ఇచ్చేసిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు.. ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్ల బ్యాంకు ఖాతాల వివరాలను, వారి ఫోన్‌ నంబర్లను సేకరిస్తుండటం గమనార్హం. ఇప్పటికే సచివాలయంలోను, ఆర్టీజీఎస్‌ కార్యాలయంలోనూ సీసీ కెమెరాల ద్వారా వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌కు చేరవేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫోన్‌ ట్యాపింగ్‌లతో ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి ఎత్తుగడ వేసిన చంద్రబాబు.. అందులో భాగంగానే డబ్బులున్న వ్యక్తులకే వైఎస్సార్‌సీపీ అంటూ దుష్ప్రచారం ప్రారంభించారు. పోలింగ్‌ సమయం దగ్గరపడే సరికి ఈ ప్రచారాన్ని తీవ్ర స్థాయికి తీసుకువెళ్లాలనేది వారి ఉద్దేశమని టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

అధికారుల  కోడ్‌ ఉల్లంఘనలపై చర్యలేవీ..
ఇలావుండగా ప్రభుత్వ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొందరు పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వినియోగిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంత బరితెగింపుతో అధికార దుర్వినియోగం, ఇంత అధికార పార్టీ పిచ్చితో వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను గతంలో ఎన్నడూ చూడలేదని పోలీసు శాఖలో పనిచేస్తున్న ఒక అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతిపక్ష పార్టీతో పాటు ఇతర పార్టీలు పోలీసు యంత్రాంగం దురాగతాలపై ఫిర్యాదు చేస్తే.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆయా జిల్లా అధికార యంత్రాంగానికి పంపి వాటిపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం అలాంటివేమీ జరగలేదని నివేదిక పంపితే ఆ ఫిర్యాదులను పక్కన పడేస్తున్నారు తప్ప జిల్లా అధికార యంత్రాంగం నివేదికలో వాస్తవం ఉందా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవడం లేదు.

పశ్చిమగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాలకు కలెక్టర్లుగా తమకు అనుకూలంగా వ్యవహరించే వారిని చంద్రబాబు నియమించారు. ఇప్పుడు వారిద్దరూ అధికార పార్టీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. అలాగే సచివాలయ స్థాయిలో కొందరు ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారులు కూడా అధికార పార్టీ నేతల్లా వ్యవహరిస్తూ యధేచ్చగా నియమావళిని ఉల్లంఘిస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలను తీసుకోవడం లేదు. గతంలో టీవీలు, పత్రికల్లో వచ్చే వార్తలు, కథనాల ఆధారంగా కోడ్‌ ఉల్లంఘనలను గుర్తించి చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు ఆ విధంగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.   

మరిన్ని వార్తలు