మనమే ముందుండాలి

1 Oct, 2018 02:29 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలపై సమీక్షలో కేసీఆర్‌

మంత్రులకు సభల నిర్వహణ బాధ్యతలు

ప్రతి నియోజకవర్గం నుంచి 25 వేల మంది తరలింపు

సభలలోపే అసమ్మతికి ముగింపు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై పూర్తిస్థాయి ప్రచారానికి టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. ఈ నెల 3వ తేదీ నుంచి వరుసగా ఉమ్మడి జిల్లాలవారీగా నిర్వహించే బహిరంగ సభలతో ప్రచారానికి ఊపు తేవాలని టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌ రావు భావిస్తున్నారు.

అభ్యర్థుల ప్రకటన, నియోజకవర్గాల్లో ప్రచారంతోపాటు రాష్ట్రవ్యాప్తంగానూ ప్రత్యర్థి పార్టీలకంటే టీఆర్‌ఎస్‌ అన్ని రకాలుగా ముందుందనే చర్చ ప్రజలు, ఓటర్లలో జరగడం ప్రధాన ఉద్దేశంగా సభల ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలతో ప్రత్యర్థి పార్టీల నేతల్లోనూ టీఆర్‌ఎస్‌ దూసుకుపోతోందనే అభిప్రాయం కలిగించాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. కేసీఆర్‌ బహిరంగ సభల షెడ్యూల్‌ కూడా ఖరారు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది.

తొలుత నియోజకవర్గానికో సభ అనుకున్నా..
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముందుగా గత ఎన్నికల తరహాలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. 50 రోజుల్లో 100 బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు అసెంబ్లీని రద్దు చేసిన రోజు ప్రకటించారు. దీనికి అనుగుణంగా సెప్టెంబర్‌ 7న హుస్నాబాద్‌లో నియోకవర్గస్థాయి బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

అనంతరం నియోజకవర్గాలవారీగా ప్రచారం కోసం అనుసరించే వ్యూహాన్ని ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈలోగా మహాకూటమి ఏర్పాటు అంశం ఊపందుకుంది. దీంతో కూటమిపై స్పష్టత వచ్చాకే ప్రచారాన్ని ప్రారంభించాలని కేసీఆర్‌ అనుకున్నారు. కానీ కూటమి ఏర్పాటు, అందులోని పార్టీలు, సీట్ల సర్దుబాటుపై ఎంతకీ స్పష్టత రాకపోవడంతో ఆలోగా ఉమ్మడి జిల్లాలవారీగా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

అసమ్మతికి ముగింపు...
అభ్యర్థిత్వాల ఖరారుతో అవకాశం రాని కొందరు నేతలు నియోజకవర్గాల్లో అసమ్మతి కార్యక్రమాలు నిర్వహిస్తుండటం, మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని ద్వితీయశ్రేణి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభల్లోపే అసమ్మతికి తెరదించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

మంత్రి కేటీఆర్‌కు ఈ బాధ్యతలను అప్పగించారు. అయితే 12 నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు సొంతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. చర్చల కోసం అసమ్మతి నేతలను పిలిస్తున్నా స్పందించడంలేదు. వారి విషయాన్ని సైతం బహిరంగ సభల్లోపే తేల్చాలని టీఆర్‌ఎస్‌ అధినేత నిర్ణయించారు. ఆయా జిల్లాల మంత్రుల మధ్యవర్తిత్వంతో అసమ్మతులను దారికి తెచ్చుకోవాలని భావిస్తున్నారు.

ఉప్పల్‌ అభ్యర్థికి కేటీఆర్‌ క్లాస్‌!
నియోజకవర్గాలవారీగా అసమ్మతి, అసంతృప్త నేతలతో మంత్రి కేటీఆర్‌ నిత్యం చర్చలు జరుపుతున్నారు. ఉప్పల్, మహబూబాబాద్‌ అసంతృప్త నేతలతో ఆయన ఆదివారం సమావేశమయ్యారు. అంద రూ కలసి పార్టీ గెలుపుకోసం పని చేయాలని సూచిం చారు. ఉప్పల్‌ నియోజకవర్గ నేతల సమావేశం వాడివేడిగా జరిగింది. ఉప్పల్‌ అభ్యర్థి బేతి సుభాష్‌రెడ్డిపై ఈ సెగ్మెంట్‌లోని కార్పొరేటర్లు, ద్వితీయశ్రేణి నేతలు కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. సుభాష్‌రెడ్డి ఎవరినీ కలుపుకుని పోవడంలేదని ఆరోపించారు. అందరి అభిప్రాయాలను తెలుసుకున్న కేటీఆర్‌.. బేతి సుభాష్‌రెడ్డిని తీవ్రంగా మందలించారు.

‘అందరినీ కలుపుకుని పోకుంటే పార్టీకి నష్టం చేసిన వాడివి అవుతావు. ఇప్పటివరకు నీ పరిస్థితి బాగా లేదు. బొంతు రామ్మోహన్‌కు ఉప్పల్‌ టికెట్‌ ఇవ్వాలని నేను సీఎం గారికి చెప్పాను. రామ్మోహన్‌ అయితే గెలిచే వాడే. గత ఎన్నికల్లో పోటీ చేసిన నీకు కేసీఆర్‌ మళ్లీ అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ నీ పరిస్థితి బాగా లేదు. ఇలాగే ఉంటే పార్టీకి నష్టం చేసిన వాడివి అవుతావు. టికెట్‌ వచ్చినప్పుడు అందరినీ కలుపుకుపోవాలి. కార్పొరేటర్ల ఇళ్ల ముందు టపాసులు పేల్చడం సరైన పద్ధతే నా? అందరూ కలసి పని చేస్తేనే గెలుపు సాధ్యమవుతుంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకో. డివిజన్‌స్థాయి నేతలతో కలసి సమావేశాలు నిర్వహించు.

డివిజ న్లలో కార్పొరేటర్‌లతో కలసి ప్రచారం నిర్వహించా లి. ఆ తర్వాత నియోజకవర్గస్థాయి సమావేశాలు నిర్వహించు. మేయర్‌ బొంతు రామ్మోహన్, లక్ష్మారెడ్డి నీకు అండగా ఉంటారు’ అని పేర్కొన్నారు. మహబూబాబాద్‌ ద్వితీయశ్రేణి నేతలతో కలసి అక్కడి అభ్యర్థి బానోత్‌ శంకర్‌నాయక్‌ ఆదివారం కేటీఆర్‌ను కలిశారు. పార్టీ కోసం పని చేయాలని, భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని కేటీఆర్‌ వారికి హామీ ఇచ్చారు. అయితే ఈ స్థానం నుంచి టికెట్‌ ఆశించిన మాలోతు కవిత ఈ సమావేశానికి రాలేదు. సోమవారం కవిత వచ్చి కేటీఆర్‌ను కలిసే అవకాశం ఉందని శంకర్‌నాయక్‌ వర్గీయులు తెలిపారు.

మంత్రులకు బాధ్యతలు...
ముందుగా అనుకున్నట్లుగా నియోజకవర్గ స్థాయిలో కాకుండా మొదట ఉమ్మడి జిల్లాలవారీగా బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నెల 3న నిజామాబాద్‌లో, 4న నల్లగొండలో, 5న వనపర్తిలో, 7న వరంగల్‌లో, 8న ఖమ్మంలో ఉమ్మడి జిల్లాలస్థాయి బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాస్థాయి కావడంతో వాటి నిర్వహణ బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులకు అప్పగించారు. ప్రతి బహిరంగ సభకు రెండు లక్షల మందికి తగ్గకుండా ప్రజలు ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ప్రతి నియోజకవర్గం నుంచి కచ్చితంగా 25 వేల మందికి తగ్గకుండా జనసమీకరణ ఉండేలా ఆయా సెగ్మెంట్ల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రులకు సూచించారు. బహిరంగ సభ ల ఏర్పాట్లు, జనసమీకరణ ప్రణాళికపై ఆయా ఉమ్మడి జిల్లాల మంత్రులతో కేసీఆర్‌ నిత్యం ఫోన్లలో ఆదేశాలు ఇస్తున్నారు. నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మంత్రులు, ముఖ్య నేతలతో ఆదివారం మాట్లాడారు. బహిరంగ సభల విజయవంతానికి ముందుగా నియోజకవర్గాల స్థాయిలో, ఆ తర్వాత ఉమ్మడి జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహించుకోవాలని ఆదేశించారు. ఇందులో ద్వితీయశ్రేణి నేతలను ఎక్కువగా భాగస్వాములుగా చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు