హైదరాబాద్‌పై ఎగిరిన ‘పతంగి’

24 May, 2019 08:41 IST|Sakshi

సాక్షి,సిటీబ్యూరో: అందరూ అనుకున్నట్టే హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంపై మజ్లిస్‌ పార్టీ మరోసారి తన జెండా ఎగురవేసింది. ఎంపీగా అసదుద్దీన్‌ ఒవైసీ తిరిగి ఎన్నికయ్యారు. దీంతో వరసగా ఆయన నాలుగోసారి ఎన్నికయ్యారు. ఈ లోక్‌సభ స్థానంలో మజ్లిస్‌ వరసగా పదిసార్లు విజయదుందుభి మోగిస్తూ వస్తోంది. 1984 ఎన్నికలతో మజ్లిస్‌ శకం ప్రారంభమైంది. అప్పటి నుంచి వరసగా సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ  ఆరుసార్లు ఎన్నికవగా, తర్వాత ఆయన వారసుడిగా అసదుద్దీన్‌ ఒవైసీ తాజాగా ఎన్నికతో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆ పార్టీకి కొంత మెజార్టీ తగ్గింది. 

వికసించని ‘కమలం’
హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ హిందుత్వ ఎజెండాతో గట్టిపోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా లక్ష్యం చేరుకోలేకపోతోంది. ప్రతిసారి ఎన్నికల్లో హేమాహేమీలను రంగంలోకి దింపి విజయావకాశాల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. ఆదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసంఘ్‌ అభ్యర్థిగా ఆలే నరేంద్ర బరిలో దిగి కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ  విజయం చేజిక్కించుకోలేక పోయారు. టీడీపీ ఆవిర్భావం అనంతరం మిత్రపక్షం కారణంగా బీజేపీకి పోటీ చేసే అవకాశం దక్కలేదు. తర్వాత  బీజేపీ పక్షాన బద్దం బాల్‌రెడ్డి బరిలోకి దిగిగట్టి పోటీ ఇచ్చినప్పటికి ఓటమి తప్పలేదు. ఒకసారి పార్టీ అగ్రనేత ఎం. వెంకయ్యనాయుడు ఎన్నికల బరిలోకి దిగినా కేవలం ప్రత్యర్థిగా పరిమితం కావల్సి వచ్చింది. తర్వాత వరసగా రెండు పర్యాయాలు తిరిగి బద్దం బాల్‌రెడ్డి పోటీ చేసినా ఓటమే మిగిలింది. అనంతరం  సుభాష్‌ చంద్రాజీ, భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి కార్యదర్శి డాక్టర్‌ భగవంతరావులను ఎన్నికల బరిలోకి దింపినా ఫలితం దక్కలేదు. ఇక టీడీపీ కూడా ఇక్కడ పరాభవమే ఎదురైంది. రెండు ఎన్నికల్లో టీడీపీ పక్షాన సియాసత్‌ ఉర్దూ పత్రిక ఎడిటర్‌ జహిద్‌ అలీఖాన్‌ గట్టి పోటీ ఇచ్చినా రెండో స్థానానికి పడిపోయారు. వాస్తవంగా టీడీపీ ఆవిర్భావం నుంచి వరసగా రెండు పర్యాయాలు బీజీపీ మద్దతుతో లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగినా పరాజయమే మిగిలింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఇక్కడ నుంచి నామమాత్రపు పోటికే పరిమితమైంది. మొన్నటి వరకు మజ్లిస్‌కు దెబ్బపడకుండా బలహీన అభ్యర్థిని రంగంలోకి దింపినా కాంగ్రెస్‌ ఈసారి గట్టి అభ్యర్థిని పోటీకి దింపినా పరాభవమే మిగిలింది. 

హైదరాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గంలో ఇలా..
ఎన్నికలు    విజేత        పార్టీ      సమీప ప్రత్యర్ధి            పార్టీ       విజేత మెజార్టీ
2004    అసదుద్దీన్‌    మజ్లిస్‌    సుభాష్‌ చందాజీ         బీజేపీ       100145
2009    అసదుద్దీన్‌    మజ్లిస్‌    జహిద్‌అలీఖాన్‌           టీడీపీ        113865
2014    అసదుద్దీన్‌    మజ్లిస్‌    డాక్టర్‌ భగవంతరావు    బీజేపీ      302454
2019    అసదుదీన్‌    మజ్లిస్‌    డాక్టర్‌ భగవంతరావు    బీజేపీ       2,82187

మరిన్ని వార్తలు