‘చంద్రబాబుకు అసెంబ్లీలో అంత సీన్‌ లేదు’

20 Jan, 2020 10:11 IST|Sakshi

సాక్షి, ఏపీ అసెంబ్లీ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తుందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముష్టి ఎత్తుకుంటూ సీఎం వైఎస్‌ జగన్‌పై ఆరోపణలు చేస్తే ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి సోమవారం ఏపీ అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ది కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన అని తెలిపారు. అమరావతిలో శాసన రాజధాని కొనసాగుతుందన్నారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తారని చెప్పారు.

గతంలో ఉన్న ఒప్పందాల మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు పిచ్చి కుక్కలా రోడ్డునపడి తిరుగుతున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులను నిండా ముంచింది చంద్రబాబేనని విమర్శించారు. గత ఐదేళ్లలో అమరావతిని కట్టలేని చంద్రబాబు.. తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ఔట్‌ డేటేడ్‌ పొలిటీషియన్‌ అని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తోందని మరోసారి స్పష్టం చేశారు. 

ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదు.. : గడికోట
ఏపీ అసెంబ్లీలో నేడు కీలకమైన అంశాలను చర్చించనున్నట్టు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ముట్టడి పేరుతో టీడీపీ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. సీఆర్‌డీఏ, అభివృద్ది వికేంద్రీకరణ బిల్లులతో పాటు మరికొన్ని బిల్లులను సభలో ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలన్నదే టీడీపీ యత్నం అని మండిపడ్డారు. చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని భరోసానిచ్చారు. తమది రైతు ప్రభుత్వమని.. రాజధాని రైతులకు న్యాయం చేస్తామని పునరుద్ఘాటించారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లక్ష కోట్ల రూపాయల రాజధాని ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో సాధ్యం కాదని తెలిపారు. కేంద్రం నుంచి సాయం అందడం కూడా అనుమానమేనని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను చంద్రబాబు అడ్డుకోవడం సరికాదని హితవుపలికారు. అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయడమే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. 

రైతులను ముంచింది చంద్రబాబే : అప్పలరాజు
అమరావతి రైతులను నిండా ముంచింది చంద్రబాబేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో టీడీపీ నేతలు భూములను కొట్టేశారని విమర్శించారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నాని మండిపడ్డారు.

చదవండి : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశం

మరిన్ని వార్తలు