ఇప్పుడు మా నేత ఆడ్వాణీ

17 Aug, 2018 02:40 IST|Sakshi

చివరిసారి మీడియా సమావేశంలో అటల్‌జీ

2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో బీజేపీ ఓడిపోయిన తర్వత 2006లో చివరిసారిగా అటల్‌జీ మీడియాతో మాట్లాడారు. లక్నోలోని సైంటిఫిక్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకత్వంలో పెద్దగా మార్పేమీ ఉండదని, వచ్చే ఎన్నికలను ఎల్‌కే ఆడ్వాణీ నేతృత్వంలో ఎదుర్కొంటామని చెప్పారు.

ఆ సమయంలో ఆయన సాంప్రదాయిక కుర్తా, పైజామా, నీలం రంగు జాకెట్‌ వేసుకున్నారు. కళ్లద్దాలు ధరించారు. చేతికర్ర సాయంతో నడుస్తూ కనిపించారు. ‘బీజేపీ నాయకత్వం విషయంలో ఎలాంటి సందేహాలు ఉండకూడదు. పార్టీ అధినేతలు మారుతూ ఉంటారు. కొత్తవారు వస్తూ ఉంటారు. అది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు మా నేత అడ్వాణీ. ఆయన నేతృత్వంలోనే వచ్చే ఎన్నికల్లో తలపడతాం’అని అటల్‌జీ చెప్పారు. ఆ సమావేశంలో అద్వానీతో పాటు ఆయన సన్నిహితుడు, బీజేపీ నేత లాల్జీ టాండన్, యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్, సుమిత్రా మహాజన్, కేసరినాత్‌ త్రిపాఠి ఉన్నారు.   

పట్టణ పేదలకు నీడ కల్పించిన వాజ్‌పేయి
పట్టణ పేదలకు సొంతింటి కల సాకారం చేసిన మహనీయుడు వాజ్‌పేయి. పట్టణాల్లోని మురికివాడల్లో నివసించే పేదలకు గూడు కల్పించాలన్న ఆలోచనతో వాల్మీకీ అంబేడ్కర్‌ ఆవాస్‌ యోజన (వాంబే) పథకానికి రూపకల్పన చేశారు. రూ.2 వేల కోట్ల అంచనాలతో వాంబే పథకాన్ని రూపొందించిన వాజ్‌పేయి దానిని హైదరాబాద్‌ నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చారు. 2001 డిసెంబర్‌ 2న ఇక్కడి ఎల్బీ స్టేడియంలో పథకాన్ని ప్రారంభించారు.

అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అనంత్‌కుమార్, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ సమక్షంలో ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌తో వాజ్‌పేయికి ప్రత్యేక అనుబంధం ఉంది. జనసంఘ్‌ పార్టీలో ఉన్నప్పుడు ఆయన తరచూ హైదరాబాద్‌కు వచ్చేవారు. తన స్నేహితుడైన సుఖ్‌దేవ్‌ ఆర్యతో కలసి రిక్షాలో తిరిగే వారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్‌ ఎంఎంటీఎస్, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కూడా ఆయన హయాంలోనే మంజూరయ్యాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి వెల్లడించారు. ఆయనతో కలసి పనిచేసిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.


వాజ్‌పేయి గొప్ప మానవతావాది
కొనియాడిన కశ్మీర్‌ వేర్పాటువాదులు
మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి గొప్ప వ్యక్తి అని, చాలా అరుదైన నాయకుడు అని కశ్మీర్‌ వేర్పాటువాదులు కొనియాడారు. కశ్మీర్‌ సమస్యను పరిష్కరించాలని ఎంతో మానవత్వంతో ప్రయత్నించారని పేర్కొన్నారు. ‘వాజ్‌పేయి మరణం చాలా బాధను కలిగించింది. ఆయన చాలా అరుదైన నాయకుడు. రాజ్యాంగాన్ని కాకుండా మానవతా దృక్పథంతో ఆయన కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు’ అని హురియత్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన మిర్వైజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌ పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో స్నేహంగా ఉండాలని నమ్మే గొప్ప వ్యక్తి అటల్‌జీ అన్నారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యపడుతుందని నమ్మిన వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. అటల్‌జీ చాలా గొప్ప వ్యక్తి అని చాలా సందర్భాల్లో నిరూపితమైందని హురియత్‌ మాజీ చైర్మన్‌ అబ్దుల్‌ ఘనీ కొనియాడారు.  

మరిన్ని వార్తలు