‘సీఎం జగన్‌ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నాం’

6 Jul, 2020 11:49 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పేదలకు ఇళ్ల స్థలాల కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవడం సరికాదని బహుజన పరిరక్షణ వేదిక సభ్యులు హితవు పలికారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలంపై ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని అన్నారు. ఇళ్ల స్థలాలపై కోర్టులో వేసిన కేసులు ఉపసంహరించుకోవాలని కోరారు. లేకుంటే 10 రోజుల్లో ప్రతిపక్షాల కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. పేదలకు ఇళ్ల స్థలాలపై సీఎం జగన్‌ను కలుస్తామని చెప్పారు. సోమవారం ఉదయం బహుజన పరిరక్షణ వేదిక సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పేదరికంలో మగ్గుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
(చదవండి: కమలం వైపు.. టీడీపీ మిడతల దండు!)

పేదలకు సీఎం జగన్ మేలు చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. దళితులకు ఇంగ్లీషు మీడియం లేకుండా చంద్రబాబు అడ్డం పడుతున్నారని అన్నారు. మొదటి నుంచీ చంద్రబాబుకు ఉన్న దుర్భుద్ధి ఇదేనని విమర్శించారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని బహుజన పరిరక్షణ వేదిక సభ్యులు పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్ నిర్ణయానికి తామంతా మద్దతు ఇస్తున్నామని పునరుద్ఘాటించారు. ప్రజాసంక్షేమం కోసం ముఖ్యమంత్రి అహర్నిశలూ శ్రమిస్తున్నారని గుర్తు చేశారు.  పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలని ఆయన ఆకాంక్షించారని తెలిపారు.
(తమ్ముడూ.. ఇది తగునా)

మరిన్ని వార్తలు