చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు

6 Jun, 2018 11:59 IST|Sakshi
మాట్లాడుతున్న బాలినేని శ్రీనివాసులరెడ్డి

ఒంగోలు పార్లమెంట్‌ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు బాలినేని విమర్శ

పర్చూరు: రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాడని ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక రాజ్యలక్ష్మీ గార్డెన్స్‌ నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బొమ్మల సెంటర్‌లోని వైఎస్సార్‌ విగ్రహానికి, అంబేడ్కర్, వంగవీటి మోహనరంగా విగ్రహాలకు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. బైక్‌ ర్యాలీ చీరాల రోడ్డు లోని వైఎస్సార్‌సీపీ కార్యలయం వరకు సాగింది. నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యలయాన్ని బాలినేని ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో బహిరంగ సభ జరిగింది. సభకు పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి రామనాథం బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు, అదే విధంగా ప్రజల్లో భరోసా కల్పించిందని చెప్పారు.

జిల్లాలో మల్లవరం, రామతీర్థం, వెలిగొండ ప్రాజెక్టులు వైఎస్సార్‌ హాయాంలోనే వచ్చాయని గుర్తుచేశారు. ఈ నాలుగు సంవత్సరాల చంద్రబాబు కాలంలో జిల్లాకు ఒక్క ప్రాజెక్టుగానీ, పరిశ్రమ గానీ రాలేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కహామీ కూడా సక్రమంగా నెరవెర్చలేదని విమర్శించారు. బాబు అబద్ధాల పుట్ట అని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోని వచ్చి ప్రజలకు మొండిచెయ్యి చూపించారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటిసారే ఒంటరీగా పోటీ చేసిందని గుర్తుచేశారు. సింహం ఒంటరిగా వస్తుందని.. ఒంటరిగా పోరాడుతుందన్నారు. కష్టపడే తత్వం నియోజకవర్గ సమన్వయకర్త రామనాథంబాబుకు ఉందని చెప్పారు. 2019 ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలుపించేందుకు గ్రామబూత్‌ స్థాయి నుంచి వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

రామనాథం బాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో వైఫల్యం చెందిందన్నారు.  ఉపాధి లేదు, పారిశ్రామిక అభివృద్ధి లేదన్నారు. బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ దేశ చరిత్రలో 3 వేల కిలోమిటర్లు పాదయాత్ర చేసిన ఘనత ఒక్క వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు పరిపాలన గాలికొదిలేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో  చీరాల నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ, అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త బాచిన చెంచుగరటయ్య,  పామర్రు సమన్వయకర్త అనీల్, బాపట్ల పార్లమెంట్‌ పరిశీలకులు గోపాలరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరికూటి అమృతపాణి, బాపట్ల పార్లమెంటరీ సమస్వయకర్త, నందిగం సురేషు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు