దీదీపై కాంగ్రెస్‌ నేత సంచలన వ్యాఖ్యలు

3 Aug, 2018 12:49 IST|Sakshi

కోల్‌కతా : ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్న పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి భారీ షాక్‌ తగిలింది. బీజేపీ వ్యతిరేక పక్షాలతో మంతనాలు జరుపుతున్న ఆమెపై పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అధీర్‌ రంజన్‌ చౌదురి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెను ఊసరవెల్లి, నియంత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలను మమతా బెనర్జీ కలసిన రెండు రోజులకే.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రకమైన విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

రంజన్‌ మాట్లాడుతూ.. మమతకు ప్రధాని కావాలనే కోరిక ఎక్కువగా ఉందని ఆరోపించారు. ఆమె ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని దుయ్యబట్టారు. ఐక్యంగా ఉన్న ప్రతిపక్షాన్ని ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో విచ్ఛిన్నం చేసేందుకు ఆమె ట్రోజన్‌ హార్స్‌లా ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు. మమతా బెంగాల్‌లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడానికి ప్రయత్నిస్తూ.. మరో వైపు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతే కోరుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని కావడానికి మమత నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అస్సాంలో పౌరసత్వం లభించని వారి విషయంలో మమతా ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని అన్నారు. ఎన్నార్సీ జాబితాలో చోటు లభించని వారిపై ప్రేమ కనబరుస్తున్న మమతా బెంగాల్‌ సరిహద్దులో ఎందుకు బారికేడ్లు పెట్టారని ప్రశ్నించారు. దీనిపై మమత తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు