ఓ.. మై ఫ్రెండ్‌

8 Apr, 2019 10:50 IST|Sakshi

పాలక్కాడ్‌లో ప్రాణమిత్రుల పోటీ

వ్యక్తిగత దూషణలకు దూరంగా ప్రచారం

‘పాలఘాట్‌ మాధవన్‌ మాటంటే ధనాధన్‌..’ ఈ పాట వినే ఉంటారు. పాలఘాట్‌ అదేనండీ కేరళలో పాలక్కాడ్‌కి మరోపేరు. అక్కడ ఎన్నికల ప్రచారంలో ఉన్న అభ్యర్థుల మాటల్లో ధనాధన్, ఫటాఫట్‌లేమీ లేవు. హద్దు మీరిన దూషణ పర్వాల్లేవు. బురద చల్లుకోవడాలు అసలే లేవు. ఎందుకంటే వారు ముగ్గురూ ప్రాణ స్నేహితులు. జెండా, ఎజెండాలు వేరైనా మనసులు ఒక్కటే. వారే ఎంబీ రాజేశ్‌ (ఎల్‌డీఎఫ్, సిట్టింగ్‌ ఎంపీ), వి.కె. శ్రీకందన్‌ (యూడీఎఫ్‌), సి.కృష్ణకుమార్‌ (ఎన్డీయే).. ఎంత ప్రాణ స్నేహితులైనా ఎన్నికల్లో ఎవరికి వారే గెలవాలని అనుకుంటారు కదా! అందుకే ఇక్కడ ఎన్నికల ప్రచారం విభిన్నంగా సాగుతోంది. తామేం చేశామో, చేస్తామో మాత్రమే చెబుతున్నారు. మిగతా అంశాల జోలికే వెళ్లడం లేదు.

రాజేశ్‌: అభివృద్ధి మంత్రం
పాలక్కాడ్‌ మొదట్నుంచి సీపీఐకి పట్టు ఉన్న ప్రాంతం. ఇక్కడ నుంచి వామపక్షాల కూటమి (ఎల్‌డీఎఫ్‌) తరపున ఎంబీ రాజేశ్‌ (సీపీఐ) రెండుసార్లుగా ఎంపీగా ఎన్నికయ్యారు. తాజాగా అదే కూటమి తరఫున బరిలో ఉన్నారు. ఒక ఎంపీగా తన నియోజకవర్గానికి ఏం చేశానో చెబుతూ ప్రచారం చేస్తున్నారు. ‘ప్రత్యర్థుల మనసు గాయపడేలా మాట్లాడడం నా అభిమతం కాదు. వారు నా స్నేహితులు కాకపోయినా సరే, వ్యక్తిగతంగా ఎవరినీ నేను కించపరచను. పాలక్కాడ్‌లో నేను చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది’ అంటున్నారు.

శ్రీకందన్‌: చిక్కులు తెచ్చేనా?
రాజేశ్‌ స్నేహితుడు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు వి.కె. శ్రీకందన్‌ యూడీఎఫ్‌ తరఫున బరిలో ఉన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి రావడం, స్థానికుడు కావడం, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కేరళ నుంచి పోటీ చేయడం శ్రీకందన్‌కు కలిసొచ్చే అంశం. అయితే యూడీఎఫ్‌ సంకీర్ణ పార్టీల మధ్య అనైక్యత శ్రీకందన్‌కు నష్టం కలిగిస్తుందన్న అంచనాలైతే ఉన్నాయి.

కృష్ణకుమార్‌: సుపరిచితం
ఇక వీరిద్దరి మరో స్నేహితుడు, బీజేపీ అభ్యర్థి సి.కృష్ణకుమార్‌కి కూడా నియోజకవర్గంలో  పట్టుంది. చాలా కాలంగా నియోజకవర్గంలో తిరుగుతూ అందరికీ చిరపరిచితుడయ్యారు. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై చాలా రోజులు కేరళ అట్టుడికిపోయింది. కేరళలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం హిందూ విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించిందన్న విమర్శలున్నాయి. ఇదే అంశం తనకి లాభిస్తుందన్న నమ్మకంతో కృష్ణకుమార్‌ ఉన్నారు.

ఎవరికి పట్టం?
శబరిమల అంశం తమకే కలిసి వస్తుం దని ఎల్‌డీఎఫ్‌ ధీమాగా ఉంది. ఆలయ ప్రవేశం అంశంలో ఎందరో మహిళలు తమ ప్రభుత్వానికే అనుకూలంగా ఉన్నారన్న నమ్మకంతో అధికార పార్టీ ఉంది. ఈ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే, అందులో అయిదు నియోజకవర్గాలు ప్రస్తుతం ఎల్‌డీఎఫ్‌ చేతిలోనే ఉన్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలైన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, వాట్సాప్‌ తప్పుడు ప్రచారంతో జరిగిన మూక హత్యలు మోదీ సర్కార్‌పై వ్యతిరేకతను పెంచాయని అధికార పక్షం భావిస్తోం ది. మొత్తమ్మీద చూస్తే శబరిమల అంశమే ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ త్రిముఖ పోటీలో ఎవరు నెగ్గినా, ఓడినా అభ్యర్థులు ముగ్గురూ కలిసి పండుగ చేసుకోవాలనే అనుకుంటున్నారు.పాలక్కాడ్‌ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు: పట్టాంబి, షోర్నాపూర్, ఒట్టప్పాళం, మన్నార్‌కడ్, కొంగడ్, మాలంపుఝా, పాలక్కాడ్‌.

ఓటర్ల సంఖ్య: 13 లక్షలు
ఎన్నికల్లో ప్రభావం చూపించే  అంశాలు: ∙శబరిమల వివాదం ∙పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ  ∙మూక హత్యలు, రాజకీయ హత్యలు.

మరిన్ని వార్తలు