22న హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటన: లక్ష్మణ్

11 Jun, 2018 21:15 IST|Sakshi
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఈ నెల 22న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్లో పర్యటించనున్నారని టీబీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..2019 ఎన్నికల్లో  అత్యధిక ఎంపీ స్థానాలను గెలిపించుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. జూన్ 7 నుంచి జులై 20 వరకు దక్షిణాది రాష్ట్రాల్లో  అమిత్‌ షా పర్యటిస్తారని, చండీఘడ్లో ప్రారంభమైన అమిత్‌ షా యాత్ర ముంభైతో ముగుస్తుంది తెలిపారు.

అందులో భాగం​గానే షా ఈ నెల 22న హైదరాబాద్ వస్తున్నారని అన్నారు. మోదీకి వ్యతిరేకంగా భావసారూప్యత లేని పార్టీలు ఏకమయ్యాయని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపే లక్ష్యంగా షా ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అమిత్ షా హైదరాబాద్ పర్యటన సాగనుందన్నారు. ఈ  సందర్భంగా వరంగల్లో నిన్న జరిగిన దళిత సింహ గర్జన సభలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ పాల్గొనడంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ సభ మొత్తం కాంగ్రెస్ కనుసన్నల్లోనే నడిచిందని ఆరోపించారు.

దళితులు, గిరిజనులపై కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ దాడులు జరిగాయని విమర్శించారు. రాష్ట్రంలో కూడా దళితులపై దాడులు జరుగుతుంటే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ ఎందుకు తప్పు పట్టడం లేదని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో మోదీని అడ్డుకోవాలనే కుట్రతోనే ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. దళితుల అత్యాచారాల చట్టాలను నీరుగార్చే ప్రయత్నం బీజేపీ ఎన్నడూ చేయలేదని వ్యాఖ్యానించారు.

ఆనాడు రాష్ట్రపతిగా దళితులను కాంగ్రెస్ ఎన్నుకునే అవకాశం ఉన్నా కూడా ఎందుకు ఎన్నుకోలేదని ప్రశ్నించారు. ఇన్ని ఏళ్ళుగా కాంగ్రెస్ దళితులను, గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని మరింత పటిష్టం చేస్తామని మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా లక్ష్మణ్ ప్రస్తావించారు. మాజీ లో​క్‌సభ స్పీకర్‌ మీరా కుమార్ తన తండ్రికి జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ను ప్రశ్నించాలి..కానీ బీజేపీని ప్రశ్నిస్తున్నారని లక్ష్మణ్‌ అన్నారు. 
 

మరిన్ని వార్తలు