ఓటు వేయలేకపోయిన తేజస్వీ.. బీజేపీ విమర్శలు

21 May, 2019 08:58 IST|Sakshi

పట్నా : ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ మీద బీజేపీ, జేడీయూ పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. కారణం ఏంటంటే.. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం బిహార్‌లో పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే తేజస్వీ ఓటు వేయలేదు. దీనిపై బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తుంది. ‘తేజస్వీ కుటుంబం నుంచి ప్రధాని బరిలో ఎవరూ లేరు. అందుకే ఆయన ఓటు వేయలేదు. దీన్ని బట్టి రాహుల్‌ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమవుతోంది’ అంటూ ఆరోపణలు చేసింది. ఆయన తల్లి, సోదరి, ఆఖరికి తేజ్‌ ప్రతాప్‌ కూడా తాను బలపరుస్తున్న అభ్యర్థి కోసం ఓటు వేశారని.. కానీ తేజస్వీ మాత్రం ఓటు వేయలేదని బీజేపీ విమర్శించింది.

జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్‌ కుమార్‌ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘తేజస్వీ జైల్లో ఉన్న తన తండ్రి గురించి ఆలోచించి అయిన ఓటు వేయాల్సిందిగా జనాలను అభ్యర్థించాడు. కానీ చివరకు ఆయనే ఓటు వేయలేదు. ఎంత ఆశ్చర్యం’ అన్నారు. ఈ విమర్శలపై ఆర్జేడీ నాయకుడు శివానంద్‌ తివారీ స్పందిస్తూ.. ‘నాకు తెలిసిన దాని ప్రకారం ఓటరు లిస్ట్‌లో తేజస్వీ పేరు పక్కన వేరే వ్యక్తి ఫోటో పడింది. దాంతో ఆయన ఓటు వేయలేకపోయార’ని తెలిపారు. అయితే ఇది పెద్ద సమస్య కాదని.. ఒక వేళ తేజస్వీ ఓటర్‌ ఐడీ తీసుకుని పోలీంగ్‌ కేంద్రానికి వస్తే.. అక్కడికక్కడే ఈ సమస్యను పరిష్కరించేవాళ్లమని ఈసీ తెలిపింది. మరో సమాచారం ఏంటంటే.. శుక్రవారం ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత తేజస్వీ ఔట్‌ ఆఫ్‌ స్టేషన్‌ వెళ్లాడని... పోలింగ్‌ నాటికి తిరిగి బిహార్‌ చేరుకోలేకపోయాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు