ఢిల్లీకి ఎన్‌పీపీ ఎమ్మెల్యేలు.. సంక్షోభం ముగిసేనా?

24 Jun, 2020 14:55 IST|Sakshi
ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎమ్మెల్యేలు (ఫైల్‌)

సాక్షి, న్యూఢిల్లీ : మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వానికి వారం రోజుల క్రితం మద్దతు ఉపసంహరించుకొన్న ‘నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన నలుగురు శాసన సభ్యులు హుటాహుటిన మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చలు జరపడం కోసమే వారు ఢిల్లీ వచ్చారని తెలుస్తోంది. మణిపూర్‌ బీజేపీ ప్రభుత్వానికి రాజీనామా చేసిన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు.

సరిగ్గా ఈ దశలో రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటును అడ్డుకునేందుకు మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడు సీకే సంగ్మా, అస్సాం ఆర్థిక మంత్రి హిమంత్‌ బిశ్వాస్‌ శర్మతో కలసి ఇంపాల్‌కు వెళ్లారు. బిశ్వాస్‌ శర్మ బీజేపీ నాయకత్వంలోని ఈశాన్య ప్రజాతంత్ర కూటమి (ఎన్‌ఈడీఏ)కి కన్వీనర్‌. ఆయనకు సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దే దిట్టగా కూడా పేరుంది. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ కూడా మొన్నటి వరకు ఈ కూటమిలోనే కొనసాగింది.

సంగ్మా, శర్మాలు నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన నలుగురు శాసన సభ్యులతో చర్చలు జరిపినప్పటికీ సమస్యకు పరిష్కారం కనిపించక పోవడంతో ఆ నలుగురు శాసన సభ్యులను తీసుకొని సంగ్మా, బిశ్వాన్‌లు ప్రత్యేక అద్దె విమానంలో ఢిల్లీకి బయల్దేరి వచ్చారు. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన యమ్‌నమ్‌ జాయ్‌కుమార్‌ సింగ్, ఎల్‌. జయంత కుమార్, లెట్‌పో హవోకిప్, ఎన్‌ కెయిసీలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెల్సిందే.

ఆ నలుగురితో తాము ఇప్పటి వరకు జరిపిన చర్చలు ఫలప్రద దిశగానే కొనసాగాయని, తదుపరి చర్చల కోసం ఢిల్లీకి వచ్చామని, ఇక్కడ బీజేపీ సీనియర్‌ నాయకులతో జరిపే చర్చలతో మణిపూర్‌ సంక్షోభం ముగుస్తుందని భావిస్తున్నానని బిశ్వాస్‌ శర్మ మీడియాకు తెలిపారు. (కేరళ ఆరోగ్య మంత్రికి యూఎన్‌ ప్రశంసలు)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా