సీనియర్లకు ‘నమో’ నమః

24 Mar, 2019 07:50 IST|Sakshi

సాక్షి, సెంట్రల్‌డెస్క్‌ :  లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 184 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, గడ్కరీ వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, సీనియర్‌ నేతలయిన ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ వంటి వారికి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదు. మరి కొందరు సీనియర్‌ నాయకులు స్వచ్ఛందంగానే ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.

మొత్తమ్మీద చూస్తే పార్టీ నాయకత్వం సీనియర్‌ నేతలు పలువురిని పక్కకు తప్పించినట్టు తెలుస్తోంది. 75 ఏళ్లు దాటిన వారిని ఎన్నికల్లో నిలబెట్టి వారిని ఇబ్బంది పెట్టవద్దన్న ఆర్‌ఎస్‌ఎస్‌ సూచనను బీజేపీ నాయకత్వం పాటించినట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, బీజేపీకి పెద్దదిక్కుగా, ఆ పార్టీకి జాతీయ గుర్తింపు రావడానికి కారకుడిగా పేరొందిన ఆడ్వాణీని కూడా తప్పించడాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి. గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు వరసగా గెలిచిన ఆడ్వాణీ స్థానంలో అమిత్‌ షాను బరిలో దింపింది.

కావాలనే పక్కన పెడుతున్నారా?
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీలో సీనియర్లను పథకం ప్రకారం పక్కన పెడుతున్నారన్న విమర్శలున్నాయి. వాజ్‌పేయి హయాంలో అత్యంత గౌరవనీయ స్థానం పొందిన ఆడ్వాణీని మోదీ అసలు పట్టించుకోలేదు. ఎదుట పడినా పలకరించకుండా ముఖం చాటేసిన సందర్భాలున్నాయి. దశాబ్దాల తరబడి పార్టీకి సేవలందిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా ఉన్న జశ్వంత్‌సింగ్, యశ్వంత్‌సింగ్, మురళీ మనోహర్‌ జోషీ, ఆడ్వాణీ, శాంతకుమార్‌ వంటి సీనియర్లను మోదీ బోర్డు నుంచి తొలగించారు.

వారిని మార్గదర్శక్‌ మండల్‌ పేరుతో ఏర్పాటు చేసిన కమిటీలో వేశారు. ఇన్నేళ్లలో ఈ కమిటీ ఒక్కసారీ సమావేశం కాలేదు. దీన్నిబట్టి మోదీ ఉద్దేశపూర్వకంగానే సీనియర్లను పక్కన పెడుతున్నారన్న భావన కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేతల్లో చాలామంది మోదీ పాలనను విమర్శించిన వారే కావడం గమనార్హం.

ఇంకొందరు తప్పుకున్నారు..
ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని ఆడ్వాణీయే చెప్పినట్టు బీజేపీ నాయకత్వం ప్రచారం చేస్తోంది. అయితే, నాయకత్వం ఆడ్వాణీని టికెట్‌ విషయంలో సంప్రదించనే లేదని ఆయన కార్యదర్శి చెబుతున్నారు. మరో సీనియర్‌ నాయకుడు, గతంలో మంత్రిగా పనిచేసిన మురళీ మనోహర్‌ జోషీ, బండారు దత్తాత్రేయకు కూడా ఈసారి టికెట్‌ లభించలేదు. అలాగే, సుమిత్ర మహాజన్, కరియ ముండా, శాంతకుమార్, బీజీ ఖండూరి వంటి అనుభవజ్ఞులనూ బీజేపీ ఈ ఎన్నికల్లో పక్కన పెట్టేసింది. కల్‌రాజ్‌ మిశ్రా, భగత్‌సింగ్‌ కోషియారి ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు స్వచ్ఛందంగా ప్రకటించారు.     

>
మరిన్ని వార్తలు