‘పవన్‌ది భజన పార్టీ.. తెలంగాణ వ్యతిరేకి’

22 Jan, 2018 13:29 IST|Sakshi

బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఫైర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ భారతదేశంలో పెరియార్ స్ఫూర్తితో వస్తున్నానని చెప్తున్న పవన్ కల్యాణ్‌వి అవకాశవాద రాజకీయాలు అని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు విమర్శించారు. ఆయన ప్రాంతీయవాదంతో పబ్బం గడపాలని చూస్తున్నారని మండిపడ్డారు. జనసేన రాజకీయ పార్టీనా? బ్రోకరేజ్ సంస్థనా? అని ప్రశ్నించారు. ‘జనసేనకు కార్యవర్గం లేదు. లోగో, జెండా ఉన్నాయి కానీ డైరెక్షన్ లేదు.
జనసేన సినిమా విడుదల కాకముందే ఫెయిల్‌ అయింది’ అని విమర్శించారు. పవన్ కల్యాణ్ తెలంగాణ వ్యతిరేకి అని, తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరులు, కేసీఆర్ కుటుంబంపై ఆయన అనేక వాక్యాలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పవన్ పొగడడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ టీఆర్‌ఎస్‌ పార్టీ బీ టీం అని, అధికార పార్టీ వ్యతిరేక ఓటును చీల్చడానికి టీఆర్‌ఎస్‌ ప్రయోగిస్తున్న అస్త్రంగా తాము భావిస్తున్నామని అన్నారు. పవన్ కల్యాణ్‌ది భజన పార్టీ అని, ఏపీలో చంద్రబాబును, తెలంగాణలో కేసీఆర్ పొగడడం అంటేనే.. ప్యాకేజీల పార్టీగా కనబడుతుందని విమర్శించారు. జనసేనలో కార్యకర్త లేరని, కేవలం అభిమానులతో పవన్‌ హడావిడి చేస్తున్నారని అన్నారు. ఏపీలో పెరుగన్నం తిని, తెలంగాణలో బిర్యానీ తినడం కాదు రాజకీయం అంటే అని అన్నారు. దేశంలోనే తెలంగాణలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగినా.. ఆ విషయమై ఎందుకు సీఎంను సంప్రదించలేదని ప్రశ్నించారు. పవన్ యాత్రకు దిక్కు మొక్కులేదని, ఆ యాత్రకు లక్ష్యం కూడా లేదని అన్నారు. ఆయన చేస్తున్న నినాదంలో అర్థం లేదని అన్నారు.


మితిమీరి మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్!
‘నటుడు ప్రకాశ్‌ రాజ్ మితిమీరి మాట్లాడుతున్నారు. ఆయన రాజకీయం గురించి మాట్లాడుతున్నప్పుడు విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు.  ప్రధాని మోదీ, అమిత్‌ షాలు హిందువులు కారంటే.. అర్థముందా.. గౌరీలంకేశ్ మృతి పట్ల స్పందించకపోతే.. మోదీ హిందువు కాదా’అని కృష్ణసాగర్‌ ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ మతిలేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేరళలో 19 మంది ఆరెస్సెస్‌ యువకులు చనిపోతే.. నీకు బాధ అనిపించలేదా? అని ప్రశ్నించారు. ప్రకాశ్ రాజ్ ద్వేషంతో మాట్లాడుతున్నాడని అన్నారు.

మరిన్ని వార్తలు