‘చంద్రబాబుది విచిత్ర మెంటాలిటీ..’

20 May, 2019 12:40 IST|Sakshi

హైదరాబాద్‌: ‘పుల్వామా ఉగ్రదాడి’అనంతరం దేశం అంతా ఒక్కటిగా నిలవాల్సిన సమయంలో కొన్ని పార్టీలు పాకిస్తాన్‌ అనుకూల భాషను వాడటంతోనే ప్రజలు తిరగబడ్డారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నవభారత నిర్మాణం కోసం పనిచేస్తుంటే.. ప్రతిపక్షపార్టీలు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై ఆయన మాట్లాడారు. 

కేంద్రంలో మోదీ ప్రభుత్వ పనితీరు, అవినీతి రహిత పాలన, అభివృద్ది, సాహసోపేతమైన నిర్ణయాలు, దేశ అంతర్గత భద్రతలో ఎక్కడ రాజీపడని తీరుతోనే ఎన్డీఏకు మరోసారి ప్రజల కట్టం కట్టనున్నారని అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్‌ ఫలితాలకు మించి ఎన్డీఏకు సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుది విచిత్ర మెంటాలిటీ అంటూ లక్ష్మణ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తే.. రుజువులు కావాలా?
‘సైనికులు ఎంతో సాహసోపేతంగా సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తే ప్రతిపక్షాలు రుజువులు అడిగాయి. ఆ దాడిలో దోమలు కూడా చావలేదని ఆరోపించాయి. దేశ సైనికుల మీద కన్నా.. ఉగ్రవాది మసద్‌ అజార్‌పైనే ప్రతిపక్ష పార్టీలు నమ్మకం ఉంచాయి. దేశంలో రామరాజ్యం రాబోతుంది. మోదీ ఓటమికి కూటమి కట్టి అజెండా లేకుండా వెళ్లారు. జైల్‌ నుంచి బెయిల్‌ మీద ఉన్న వాళ్లంతా కూటమి కట్టారు. ఈ కూటమిలను ప్రజలు నమ్మలేదు. ఎన్డీఏకు గతం కన్నా ఎక్కువ సీట్లే వస్తాయి. పశ్చిమబెంగాళ్‌లో మమతా బెనర్జీ నియంతృత్వ పాలన సాగించింది. మమత కోటలకు బీటలు పడుతున్నాయి. బెంగాళ్‌లో కాషాయ జెండా ఎగరేస్తాం

‘ట్యాంపరింగ్‌ అన్నావ్‌.. ఐనా గెలుస్తా అంటున్నావ్‌?’
ఓటమికి చంద్రబాబు సాకులు వెతుకుతున్నారు. ట్యాంపరింగ్‌ జరిగింది అంటున్నారు.. మళ్లీ నేనే గెలుస్తానని పరస్పర విరుద్ద ప్రకటనలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో నువ్వు గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేశాయి. కానీ ఇప్పుడు ఓడిపోయే పరిస్థితి వచ్చే సరికి ఈవీఎంలు ట్యాంపరింగ్‌ అయ్యాయి అంటున్నావు. అందుకే బాబును యూటర్న్‌ మహానుభావుడు అనేది. చంద్రబాబు విచిత్ర మెంటాలిటీలో ఉన్నారు’అంటూ లక్ష్మణ్‌ మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు