ఎంపీ, ఎమ్మెల్యేను బహిష్కరించాలి

8 Jul, 2018 13:00 IST|Sakshi
మాట్లాడుతున్న కొయ్యల ఏమాజీ

బెల్లంపల్లి: నీతిమాలిన పనికి పాల్పడిన పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కుటుంబ సభ్యులను బెదిరించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను టీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరువురు ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి హేయంగా ఉందన్నారు. ఇద్దరి నిర్వాకం వల్ల జిల్లా పరువు, ప్రతిష్ట రాష్ట్రంలో దిగజారిపోయిందని విమర్శించారు. మున్సిపల్‌ కౌన్సిలర్‌ కొప్పుల సత్యవతి కూతురితో ఎమ్మెల్యే చిన్నయ్య ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడడం, అసమ్మతి కౌన్సిలర్లను ఇబ్బందులకు గురి చేస్తామని హెచ్చరించడం దారుణమన్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలి పూర్తిగా ఆక్షేపనీయమన్నారు.ఎమ్మెల్యే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
 
ఎంపీ బాల్క సుమన్‌ ఇద్దరు మహిళలతో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేయడం సరైంది కాదన్నారు. బాధిత మహిళలపై జనవరిలో ఎంపీని బ్లాక్‌ మెయిల్‌ చేసినట్లు కేసు పెట్టామని మంచిర్యాల పోలీసులు ప్రకటించడం ఎంపీకి కొమ్ముకాయడమే అవుతుందన్నారు. అప్పట్లో సదరు మహిళలపై కేసులు పెట్టినట్లు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్యేలపై జ్యూడీషియల్‌ విచారణ జరిపించాలన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు సైతం ఓ ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిని పరుష పదజాలంతో దూషించడం, బెదిరించడం సరైంది కాదన్నారు. ప్రేమ్‌సాగర్‌ రావుపై కూడా క్రిమినల్‌ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 
సమావేశంలో బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు డి.ప్రకాష్, కుసుమ భాస్కర్, కె.గోవర్ధన్, గట్టురాజం, అరుణ్‌కుమార్, సత్యనారాయణ రెడ్డి, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు