పెద్దల సభలో గలాటా

20 Mar, 2020 08:00 IST|Sakshi
ఎమ్మెల్సీ ఇబ్రహీం

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఇబ్రహీం వ్యాఖ్యలు  

భగ్గుమన్న బీజేపీ సభ్యులు ఉపసంహరించుకున్న ఇబ్రహీం

కర్ణాటక, శివాజీనగర: ఉద్యోగం ఇచ్చేటపుడు ఏమి అనుభవం ఉందని అడిగేవారు, పెళ్లిచూపుల్లో అబ్బాయికి ఏమి అనుభవం ఉందని ఎందుకు అడగరు? అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం చేసిన వ్యాఖ్యలు గురువారం విధాన పరిషత్‌లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు మహిళలకు అవమానకరమని బీజేపీ ఎమ్మెల్సీ తేజస్వినిగౌడ వాకౌట్‌ చేయగా,  ఇతర సభ్యులు ఆయనపై మండిపడ్డారు. భారత రాజ్యాంగంపై చర్చ ఆరంభించిన ఇబ్రహీం ఈ మాటలనగానే తేజస్విని గౌడ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  కాషాయ సభ్యులు నారాయణస్వామి, రవికుమార్, అరుణ్‌ శహాపుర, సుబ్రమణి తదితర సభ్యులు లేచి నిలబడి ఆమెకు మద్దతు పలికారు. ఇబ్రహీం ఆడ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు పిల్లాడికి అనుభవాన్ని అడిగారా? అని ప్రశ్నించారు. ఈ దశలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాగ్వివాదం నెలకొంది. ఇబ్రహీం క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే ఇబ్రహీం పట్టించుకోకుండా చర్చను కొనసాగిస్తుండగా తేజస్వినిగౌడ సభ నుంచి వెళ్లిపోయారు. బీజేపీ సభ్యులంతా ఇబ్రహీం క్షమాపణ చెప్పాలని పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. 

వ్యాఖ్యలు ఉపసంహరణ  
విపక్షనేత ఎస్‌.ఆర్‌.పాటిల్, జేడీఎస్‌ సభ్యుడు బసవరాజ హొరట్టి తదితర సభ్యులు ఈ విషయమై సమాలోచన జరిపారు. చివరకు బసవరాజ హొరట్టి ఇబ్రహీం ఆ మాటను మాట్లాడకుండా ఉండాల్సింది. ఆయన తన మాటలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. దీంతో ఇబ్రహీం తన మాటలను ఉపసంహరించుకున్నట్లు తెలపడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. 

మళ్లీ ఈవీఎంలపై రగడ  
ఈవీఎంలలో గోల్‌మాల్‌ జరుగుతోందని ఇబ్రహీం వ్యాఖ్యానించడంతో మళ్లీ మాటల యుద్ధం చోటు చేసుకుంది. బీజేపీ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలు ఉండరాదని, బ్యాలెట్‌ పేపర్‌ తీసుకురావాలని చెబితే మీకెందుకు కష్టమని ఇబ్రహీం ప్రశ్నించారు. బీజేపీ గెలిస్తేనే ఈవీఎంలు  సమస్య అవుతాయి, కాంగ్రెస్‌ గెలుపొందినప్పుడు అవి కనిపించవా? అని ప్రశ్నించారు. ఈవీఎంలు దుర్వినియోగం జరగవని అన్నారు.

మరిన్ని వార్తలు