‘సుప్రీం’ను ఖాతరు చేయని బీజేపీ నేతలు

29 Oct, 2018 19:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అయ్యప్ప భక్తులను అరెస్ట్‌ చేస్తున్నారంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. అవసరమైతే కేరళలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేస్తామంటూ హెచ్చరికలు కూడా చేశారు. ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో ప్రత్యక్షంగా భాగం కాకపోయినా అధికార పార్టీ అధ్యక్షుడైనందున ఆయన మాటలను కేంద్రం వైఖరిగానే పరిగణించాల్సి ఉంటుంది. కేరళ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేస్తామంటూ హెచ్చరించడం అంటే ఆయన ప్రభుత్వంలో భాగంగా మాట్లాడుతున్నట్లే.

అలాంటి వ్యక్తి శబరిమల అయ్యప్ప ఆలయం విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిన అవసరం లేదని మాట్లాడడం అంటే సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయక పోవడమే. సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో ఆరెస్సెస్, బీజేపీ పార్టీలు భక్తులను సమీకరిస్తుంటే వారికి మద్దతుగా అమిత్‌ షా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. శబరిమలలోలాగా అయోధ్య–రామమందిరం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానించారు. ఆయన ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయలేదుగానీ, ఈ రెండు మందిరాల అంశాల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారనేది స్పష్టం అవుతుంది.

రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద తనకు సంక్రమించిన అధికారాలకు సుప్రీంకోర్టు వక్రభాష్యం చెబుతూ కార్యనిర్వాహక అధికారాల పరిధిలోకి జొరబడుతోందని కేంద్రంలోని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బహిరంగంగానే సుప్రీంకోర్టును విమర్శించారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును బీజేపీ నేతలు విమర్శిస్తుంటే సుప్రీం కోర్టు ఎందుకు మౌనం వహిస్తుందో అర్థం కావడం లేదు.

మరిన్ని వార్తలు