సీఎంతో ఎలాంటి సమస్యల్లేవు : బీజేపీ

14 Apr, 2018 08:47 IST|Sakshi
బీజేపీ జెండాలతో కార్యకర్తలు (ప్రతీకాత్మక చిత్రం)

సాక్షి, న్యూఢిల్లీ : కథువా హత్యాచార ఘటన.. బీజేపీ మంత్రుల రాజీనామాలు.. తదితర పరిణామాల నేపథ్యంలో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ)తో పొత్తు సంగ్ధిగ్ధంలో పడ్డట్లు రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ రామ్‌ మాధవ్‌ స్పందించారు. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో ఎలాంటి సమస్యల్లేవని ఆయన ప్రకటించారు. (నోరువిప్పిన మోదీ)

శుక్రవారం రాత్రి ఢిల్లీలో రామ్‌ మాధవ్‌ ఓ జాతీయ న్యూస్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘కూటమి విషయంలో ఎలాంటి సమస్యల్లేవు. మంత్రుల రాజీనామా పూర్తిగా బీజేపీ నిర్ణయమే. సీఎం మెహబూబా ముఫ్తీ మాపై ఒత్తిడి తెచ్చినట్లు వస్తున్న కథనాలు నిజం కాదు. ఈ కేసులో సరైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ కూడా ఆమెకు సూచించారు. పీడీపీతో పొత్తు కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు. 

ఎనిమిదేళ్ల బాలికను కొందరు అహరించి.. బంధించి.. డ్రగ్స్‌ ఇచ్చి.. ఆపై అత్యాచారం.. కిరాతకంగా హింసించి చంపిన ఘటన తెలిసిందే. జనవరిలో జరిగిన ఈ దాష్టీకంలో విస్మయకర విషయాలు ఆలస్యంగా వెలుగులోకి రావటంతో ఈ ఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో నిందితులకు మద్ధతుగా నిర్వహించిన ఓ ర్యాలీలో బీజేపీకి చెందిన మంత్రులు చంద్ర ప్రకాశ్‌ గంగా, లాల్‌ సింగ్‌లు పాల్గొనటం.. అది కాస్త తీవ్ర విమర్శలకు దారితీయటంతో చివరకు శుక్రవారం సాయంత్రం వారిద్దరూ తమ పదవులకు రాజీనామాలు చేశారు. శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించి బీజేపీ అధిష్ఠానం వారి భవితవ్యం నిర్ణయించనుంది.

కథువా కేసులో వరుస పరిణామాల కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు