వాళ్లను కచ్చితంగా చంపించేవాడిని: బీజేపీ ఎమ్మెల్యే

27 Jul, 2018 20:19 IST|Sakshi
బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యాత్నా (ఫైల్‌ ఫొటో)

సాక్షి, విజయపుర/బెంగుళూరు: ‘నేనే గనుక హోం మంత్రి అయ్యుంటే.. ఈ గాలి పీల్చుతూ.. ఇక్కడి నీరు తాగుతూ.. మనందరం పన్నులు కడుతుంటే హాయిగా అన్ని సదుపాయాలు అనుభవిస్తూ.. భారత ఆర్మీపై విమర్శలు చేస్తున్నవారిని వదిలిపెట్టే వాడిని కాదు.  దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మేధావులను, ఉదారవాదులను తుపాకులతో కాల్పించేవాడిని’ అని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యాత్నా వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. విజయపురలో గురువారం ఏర్పాటు చేసిన ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదారవాదులు, మేధావులతో భారత్‌కు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. 

కాగా, బసనగౌడ గతంలో మూడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో టెక్ట్స్‌టైల్స్‌, రైల్వేశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2010లో బీజేపీని వీడి జేడీఎస్‌లో చేరారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మందు మళ్లీ సొంత గూటికి చేరుకున్న బసన్‌గౌడ విజయపుర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు ఎమ్మెల్యే వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌, జేడీఎస్‌లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షున్ని డిమాండ్‌ చేశాయి. హిందువులకు మాత్రమే సహాయం చేయండి. ముస్లింలను పట్టించుకోవద్దని స్థానిక నేతలకు పిలుపునిచ్చి ఆయన గతంలోనూ వార్తల్లో నిలిచారు.

మరిన్ని వార్తలు