‘గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టింది’

25 May, 2019 14:18 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ఏర్పడుతున్న కొత్త ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ..అత్యంత జాగరూకతతో కొత్త ప్రభుత్వం అడుగులు వేయాలని సూచించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 86 వేల కోట్ల నుంచి 2 లక్షల 14 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పుల్లోకి నెట్టిందని పేర్కొన్నారు. అదే విధంగా ఏయే శాఖల్లో అప్పులు ఎందుకు తీసుకున్నారోనన్న అంశంపై కొత్త ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ సహా అన్ని శాఖల్లో జరిగిన నిధుల దుర్వినియోగంపై కూడా విచారణకు ఆదేశించాలని విఙ్ఞప్తి చేశారు.

ఈ సమస్యలన్నీ పరిష్కరించి రాష్ట్రాన్ని ఆదర్శ ఆంధ్రప్రదేశ్‌గా మలిచే విధంగా పని చేయాలని కోరారు. వైఎస్సార్‌ సీపీ ప్రకటించిన నవరత్నాలకు విశేష ప్రజాదరణ లభించిందని, వాటితో పాటు విభజన హామీల అమలు సాధించుకునేలా కృషి చేయాలన్నారు. అవినీత పాలన వల్లే చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూశారని పేర్కొన్నారు. రాజ్యాంగానికి విఘాతం కలిగించేలా వ్యవహరించి అధికారానికి దూరమయ్యారని విమర్శించారు.

మరిన్ని వార్తలు