ఇంటర్‌ పోరు.. 2న తెలంగాణ బంద్‌

30 Apr, 2019 19:02 IST|Sakshi

హైదరాబాద్‌: విద్యార్థులు, తల్లిదండ్రులలో విశ్వాసం నింపడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని అందుకే ఆత్మహత్యలు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇంటర్‌ అవకతవకలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా మే 2న తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ట్యాంక్‌బండ్‌  సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ..  ఫలితాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. బోర్డు వైఫల్యం కారణంగానే ఇంత ఘోరం జరిగిందన్నారు.

ఇంటర్‌ ఫలితాల అవకతవకల వెనక భారీ కుంభకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు నిరసన తెలిపితే అమానవీయంగా, ఎమెర్జెన్సీ తలపించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తోందని విమర్శించారు. తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో తప్పులకు నిరసనగా బీజేపీ ఆఫీసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్‌ సోమవారం నుంచి నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి అరెస్ట్‌ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువస్తామని తెలిపారు. సిట్టింగ్‌ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, అలాగే ఇంటర్‌ బోర్డును సమూలంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు