బాబు పదవి 3 వారాల్లో ఊడటం ఖాయం: జీవీఎల్‌

2 May, 2019 17:28 IST|Sakshi
బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహా రావు(పాత చిత్రం)

ఢిల్లీ: మూడు వారాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పదవి ఊడిపోవడం ఖాయమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిథి జీవీఎల్‌ నరసింహారావు జోస్యం చెప్పారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ..తన సమీక్షల వల్ల ఏదో వెలగబెట్టినట్లు ఆయన చేస్తోన్న ప్రకటనలు చూస్తుంటే అందరికీ నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో కరవు కాటకాలతో రైతులు అల్లాడుతున్నా బాబు పట్టించుకోలేదని మండిపడ్డారు.

‘దొంగ డ్రామాలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఎన్నికల నియమావళిని రాజకీయం చేయాలని ఆరాటపడుతున్నారు. ఎన్నికల సంఘంతో చర్చించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. రైల్వే జోన్‌ ప్రకటన సమయంలో ఇంకా ఎన్నికల ప్రకటన రానప్పటికీ ఎన్నికల సంఘం అనుమతితోనే రైల్వే శాఖ ప్రకటన చేసింద’ని వ్యాఖ్యానించారు.

‘స్థానికంగా కౌన్సిల్‌ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ అనుమతితో రైల్వే జోన్‌ ప్రకట చేశారు. ప్రతి దానికీ చంద్రబాబు రాజకీయం చేయడం వల్ల టెన్షన్‌ తప్ప ఆయనకు ఒరిగేదేమీ లేదు. మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం మోదీ ప్రభుత్వ దౌత్య విజయం. దేశ భద్రతకు మా ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది అనడానికి ఇదొక నిదర్శనం. ఈ అంశంపై విపక్షాలు చచ్చు ప్రకటనలు చేస్తున్నాయ’ని ఆరోపించారు.

మరిన్ని వార్తలు