దళితులపై హింస.. బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ

8 Apr, 2018 14:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ నేతలు ఒక్కొక్కరిగా సొంత పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నది. ఈ తరుణంలో తాజాగా వాయవ్య ఢిల్లీ నియోజక వర్గ ఎంపీ ఉదిత్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ బంద్‌ తర్వాత దళితులపై హింస పెరిగిపోయిందంటూ ప్రకటించి బాంబు పేల్చారు.

‘ఏప్రిల్‌ 2న భారత్‌ బంద్‌ తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయి. ఈ మేరకు ఆధారాలతోసహా కథనాలు కూడా వెలువడుతున్నాయి. వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ శనివారం ఉదిత్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘బార్మర్‌, జలోరే, జైపూర్‌, గ్వాలియర్‌, మీరట్‌, బులంద్‌షహర్‌, కరోలి.. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో దళితులపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు హింసిస్తున్నారు’  అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే ఆయన పేర్కొన్న ప్రాంతాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉండటంతో ఇప్పుడు తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. 

పైగా గ్వాలియర్‌కు చెందిన ఓ దళిత ఉద్యమవేత్తను పోలీసులు ఉత్త పుణ్యానికి దారుణంగా హింసించారంటూ ప్రత్యేకించి ఉదిత్‌ రాజ్‌ చెప్పటం చర్చనీయాంశంగా మారింది. కాగా, దళిత చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఏప్రిల్‌ 2న దళిత సంఘాలు భారత్‌ బంద్‌ చేపట్టాగా.. ఏడు రాష్ట్రాల్లో అది హింసాత్మకంగా మారటం.. 11 మంది మృతి చనిపోవటం.. పలువురు గాయపడటం తెలిసిందే.

మరిన్ని వార్తలు