‘కాంగ్రెస్‌- టీఆర్‌ఎస్‌లది డూప్‌ ఫైట్‌’

18 Sep, 2018 15:25 IST|Sakshi
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళల పట్ల వివక్ష చూపిస్తోందని.. అందుకే వారిని ఇంటికే పరిమితం చేసిందని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. మంగళవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా సూచన మేరకు మహిళా సమ్మేళనం ఏర్పాటు చేసామని, ఈ సమావేశానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా పొల్గొంటారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారిని ఇంటికే పరిమితం చేసిందని మండిపడ్డారు. మహిళా రుణాలకు వడ్డీ మాఫీ, అభయ హస్తం, స్త్రీ నిధి డబ్బులు ఇలా ఏది అమలు కాలేదని విమర్శించారు. 

ఇంటింటికి నీళ్లు ఇవ్వంది ఓటు అడగనని కేసీఆర్‌ అన్నారు
ఉద్యమ పార్టీ అని నమ్మి ఓటేసిని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ కారణం లేకుండా తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని కేసీఆర్‌ రద్దు చేశారని విమర్శించారు. ఇంటింటికి నీళ్లు ఇవ్వకుండా ఓటు అడగనన్న కేసీఆర్‌.. ఇప్పుడు ప్రజలను ఓట్లు ఎలా అడగతారంటూ ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు శాంపిల్స్‌గా మాత్రమే కట్టారని, రెండు లక్షల ఇళ్లు ఎక్కడా కట్ట లేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవనితీ జరిగిందని విచారణ చేయిస్తానని చెప్పిన కేసీఆర్‌ ఎందుకు వెనక్కి తగ్గారన్నారు. కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌లు లోపాయకారి ఒప్పందం చేసుకుందని, ప్రజల మందు డూప్‌ ఫైట్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఒప్పందం ప్రకారం ప్రజలను నమ్మించడానికి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని తెలిపారు.

పరీక్షల్లో పుస్తెలు మెట్టెలు తీయడం హిందూ సంస్కృతిని అవమానించడమేనని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ అభిప్రాయపడ్డారు. మహిళలతో చేగుంటా లేక రంగారెడ్డి జిల్లాలో ఒక చోట ఈ నెల 27న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షతను సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళలు బీజేపీ వెంట ఉన్నారని తెలిపేలా ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. మహిళలకు తగినన్ని సీట్లు కేటాయించాలని మహిళా మోర్చా నాయకురాల్లు లక్ష్మణ్‌కు విజ్ఞప్తి చేశారు.   

మరిన్ని వార్తలు