బాలాకోట్‌.. టార్గెట్‌ బ్యాలెట్‌?

21 Mar, 2019 10:31 IST|Sakshi

సర్జికల్‌ స్ట్రయిక్స్‌.. ఓట్లు కురిపిస్తుందని బీజేపీ ఆశ

రాజస్తాన్, యూపీ, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్‌ చేతిలో ఓటమి.. మందకొడిగా ఆర్థిక వ్యవస్థ.. పతాకస్థాయికి నిరుద్యోగం.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఇలాంటి పరిస్థితిని ఏ పార్టీ కూడా కోరుకోదు.
సీన్‌ కట్‌ చేస్తే...

పుల్వామా ఉగ్రదాడి.. అందుకు ప్రతిగా భారత్‌ నిర్వహించిన సర్జికల్‌ స్ట్రైక్స్‌.. భారతీయ జనతా పార్టీకి కలిసొచ్చేలా మారిపోయాయా? అయితే.. ఓటర్లను వర్గాలుగా వేరు చేసే ఇలాంటి అంశాలకు రెండువైపులా పదునే అన్నది విశ్లేషకుల అంచనా!!

సర్జికల్‌ స్ట్రైక్స్‌కు కొన్ని రోజుల ముందు ఓ ప్రముఖ దినపత్రిక ఓ సర్వే నిర్వహించింది. అందులో తేలిందేమిటంటే బీజేపీ భవిష్యత్తు ఏమంత గొప్పగా లేదూ అని! గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉంటుందని ఆ పత్రిక అంచనా వేసింది కూడా. అయితే రెండు వారాలు గడిచాయో లేదో.. పుల్వామాదాడి జరగడం.. అందుకు ప్రతిగా భారత వాయుసేన పాకిస్తాన్‌ లోపలికి చొచ్చుకుపోయి బాలాకోట్‌పై బాంబులు కురిపించడంతో పరిస్థితి మొత్తం తారుమారైంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు బాలాకోట్‌ దాడికి సంబంధించిన రుజువులు కోరడంతో పరిస్థితి బీజేపీకి మరింత అనుకూలంగా మారింది. దశాబ్దాలుగా కశ్మీర్‌ అంశంపై ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెప్పగలిగిన వాడు మోదీ ఒక్కడే అన్న అభిప్రాయం ఒక వర్గంలో బలపడగా.. ఇవన్నీ గిమ్మిక్కులేనని నమ్మేవాళ్లు ఇంకో వర్గంలో చేరిపోయారు. ఈ రకమైన పోలరైజేషన్‌ కారణంగా ఓటేసే సమయానికి సామాన్యుడు ఇతర వాటన్నింటినీ పక్కనబెట్టి దేశ భద్రత అంశంవైపే మొగ్గు చూపుతాడని నిపుణులు చెబుతారు.

జాతీయవాదం బీజేపీకి అనుకూలం?
ప్రతిపక్షాలను దేశద్రోహులుగా చిత్రీకరించి మెజార్టీ ప్రజలను తమకనుకూలంగా తిప్పుకునేందుకు జాతీయ వాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. సరిహద్దుల్లో సైనికులు మరణిస్తుంటే మీరు అలా చేస్తారా? ఇలా చేస్తారా? అని తన సోషల్‌ మీడియా సైన్యంతో ప్రతిపక్షాలపై ఈ జాతీయవాదులు ఓ స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. జాతీయ వాదమన్న అంశాన్ని ముందుంచడం ద్వారా మోదీ ప్రతిపక్షాల కంటే రెండు అడుగులు ముందు ఉన్నారని, మోదీ ప్రసంగాల్లో హిందుత్వం కంటే, జాతీయ వాద భావజాలమే ఎక్కువగా ఉండటం ఈ వ్యూహంలో భాగమే కావచ్చునని కొంతమంది నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సైనిక చర్యలతో నష్టమూ లేకపోలేదు
బాలాకోట్‌ దాడుల వల్ల ఎన్నికల్లో అధికార పార్టీకి లాభం చేకూరడంతోపాటు నష్టం కూడా జరిగే అవకాశముంది. భారతదేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ ఇలాంటి సైనిక చర్యల వల్ల అధికారంలో ఉన్న పార్టీలకు మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత 1993లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోవడం.. మరోవైపు గోద్రా మారణకాండ తరువాత 2002లో అసెంబ్లీ రద్దు తరువాత జరిగిన ఎన్నికల్లో మోదీ మళ్లీ విజయం సాధించడం.. ఈ రెండు ఎన్నికల్లోనూ బీజేపీ ఓట్ల శాతం పెరగడాన్ని చూస్తే.. పోలరైజేషన్‌ అన్నది ఆ పార్టీకి అనుకూలంగా మారిందని తెలుస్తుంది. అయితే బాబ్రీ ఘటన తరువాతి యూపీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు జట్టుకట్టడం వల్ల బీజేపీ అధికారం కోల్పోయింది. మొత్తమ్మీద ఒక అంశం ఆధారంగా ఓటర్లు రెండు వర్గాలుగా చీలిపోవడం అధికార పార్టీకి లాభమా? నష్టమా అనేది చెప్పడం కష్టం. బాలాకోట్‌ దాడి ఘటనల తరువాత.. ఎన్నికల నోటిఫికేషన్‌ తరువాత జరిగిన రెండు ఒపీనియన్‌ పోల్స్‌లోనూ భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్‌ సంస్థ చేసిన సర్వేలో బీజేపీకి గత ఎన్నికల కంటే దాదాపు 50 సీట్లు తగ్గుతాయని చెప్పడం.. సీవోటర్‌ ఒపీనియన్‌ పోల్‌లో 15 సీట్ల తగ్గుదల మాత్రమే నమోదు రావడం ఇక్కడ చెప్పుకోవాలి.

మరిన్ని వార్తలు