అలసత్వమే ముంచింది!

24 May, 2019 03:33 IST|Sakshi

అసెంబ్లీ ఫలితాలతో టీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో నిర్లక్ష్యం

ప్రత్యర్థి పార్టీలతో పోటీ లేదన్న అలసత్వం

లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పరాభవం

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికలు మిశ్రమ ఫలితాలను అందించాయి. 5 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుచుకుని రెండోసారి అధికారంలోకి వచ్చింది. అనంతరం ఇద్దరు స్వతంత్రులు, 11 మంది కాంగ్రెస్, ఒక టీడీపీ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌ పూర్తిగా ఢీలా పడింది. 6 నెలలైనా కాకముందే లోక్‌సభ ఎన్నికలొచ్చాయి. టీఆర్‌ఎస్‌ క్యాడర్‌ ఒకరకమైన అతివిశ్వాసంలో ఉండిపోయింది. గెలుపు తమదే అన్న ధోరణితో పార్టీ క్యాడర్‌లో, కింద స్థాయి నేతల్లో అలసత్వం నెలకొంది. 16 సీట్లలో గెలుపు అనే టీఆర్‌ఎస్‌ నినాదానికి తగినట్లుగా జిల్లా, నియోజకవర్గాల నేతలు పని చేయలేకపోయారు.

ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీతో తమకు పోటీ లేనేలేదనే ధోరణితో వ్యవహరించారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ మాత్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమ బలం చూపెట్టాలనే ప్రయత్నంలో నిమగ్నమయ్యా యి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, మంత్రులు క్రీయాశీలకంగా పని చేసినా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆశించిన మేరకు సమన్వయం కనిపించలేదు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ గెలుపు కోసం మొదట వేర్వేరుగా పని చేశాయి. పోలింగ్‌ దగ్గరపడుతున్న కొద్దీ స్థానిక నేతలు వ్యూహం మార్చారు. బీజేపీ, కాంగ్రెస్‌లో ఏ పార్టీలో బలమైన అభ్యర్థి ఉంటే మిగిలిన పార్టీ వారి కి మద్దతిచ్చి ఎక్కువ ఓట్లు పోలయ్యేలా పరస్పరం అంగీకారం కుదుర్చుకున్నాయి.

బీజేపీ, కాంగ్రెస్‌ క్షేత్రస్థాయిలో కలిసిపోయినట్లు కనిపించినా టీఆర్‌ఎస్‌ పెద్దగా పట్టించుకోలేదు. ఫలితం ఆశించినట్లు రాకపోవడానికి అధికార పార్టీలో నెలకొన్న అలసత్వమే కారణమని టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు చెబుతున్నారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో తమ క్యా డర్‌ ఒకింత నిర్లక్ష్యంగానే వ్యవహరించిందని అం టున్నారు. కాంగ్రెస్, బీజేపీల వ్యూహాన్ని బట్టి ప్రతివ్యూహం అమలులో తమ పార్టీ నేతలు విఫలమయ్యారని చెబుతున్నారు. రెండు పార్టీలు కలసి పని చేయడం వల్లే పలు కీలక నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు నిర్ధారణకు వస్తున్నారు. 


మార్పులతో...
లోక్‌సభ అభ్యర్థుల ఖరారులో టీఆర్‌ఎస్‌ వ్యూహం మిశ్రమ ఫలితాలనిచ్చింది. సిట్టింగ్‌ ఎంపీలను మా ర్చిన స్థానాల్లో విజయాల శాతం ఎక్కువగానే ఉంది. కొత్త వారిని బరిలోకి దింపిన మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, చేవెళ్ల, పెద్దపల్లి స్థానాలను గెలుచుకోగా, నల్లగొండ, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరిలో ఓడిపోయింది. సిట్టింగ్‌ ఎంపీలు బరిలో దిగిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, భువనగిరి స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోగా.. మెదక్, వరంగల్, జహీరాబాద్‌లో గెలిచింది.

>
మరిన్ని వార్తలు