ఎవరిపైనా తప్పుడు కేసులు పెట్టలేదు : బొత్స

10 Sep, 2019 19:37 IST|Sakshi

సాక్షి, విజయనగరం : టీడీపీ ‘ఛలో ఆత్మకూరు’ యాత్రపై మంత్రి బొత్స సత్యనారయణ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు నాయుడు ఏదో చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెయిడ్‌ ఆరి​స్టులతో చంద్రబాబు కుటిల రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారుని విమర్శించారు. సీఎం వైఎస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక చంద్రబాబు రాష్ట్రంలో గందరగోళం సృషించేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. ఆయన జిమ్మిక్కులన్నీ తమకు తెలుసన్నారు.

లా అండ్‌ ఆర్డర్‌ అదుపులో ఉండాలనే రాష్ట్రంలో సెక్షన్‌ 30 అమలు ఉందన్నారు. ఇది ఈనాటిది కాదని, గత నాలుగేళ్లుగా కొనసాగుతుందన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరిపైనైనా అధికారులు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. యరపతినేని అక్రమ మైనింగ్‌  పరిశీలనకు వెళ్లేటప్పుడు తమను కూడ అడ్డుకొని పోలీసు స్టేషన్లకు తరలించారని గుర్తు చేశారు. తాము ఎవరిపైనా తప్పుడు కేసులు పెట్టలేదన్నారు. కూన రవి కుమార్‌ అధికారులను నిర్భందించి బెదిరించిన వాస్తవం కాదా? కోడెల అసెంబ్లీ ఫర్నిచర్‌ను పట్టుకుపోయింది నిజం కాదా? చింతమనేని ఎస్సీలను బెదిరించలేదా? సోమిరెడ్డికి కోర్టు ఆదేశాలు ఇవ్వలేదా? వీటిలో ఏది తప్పుడు కేసు అని బొత్స ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు శాంతి భద్రతకు విఘాతం కల్పించకూడదని బొత్స విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు