వంద శాతం ఇన్‌సైడర్‌ ట్రేడింగే

28 Aug, 2019 04:12 IST|Sakshi

ప్రభుత్వం వద్ద అన్ని ఆధారాలున్నాయి: మంత్రి బొత్స

సాక్షి, అమరావతి: రాజధాని భూముల్లో వంద శాతం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని, దీనిపై తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వీటన్నిటిపై ప్రభుత్వం విచారణ చేసి నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. వరదలు వస్తే రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుందని అనగానే టీడీపీ నేతలు ఉలిక్కిపడి రాజధానిని అమరావతి నుంచి మారుస్తున్నారంటూ దుష్ప్రచారం ప్రారంభించారని విమర్శించారు. ‘సుజనా చౌదరి రాజధానిలో సెంటు భూమి లేదంటున్నారు. సుజనాకు ఉన్న 120 కంపెనీల్లో కళింగ గ్రీన్‌టెక్‌ కంపెనీ డైరెక్టర్‌ జతిన్‌కుమార్‌కు చందర్లపాడు గుడిమెట్ల గ్రామంలో 110 ఎకరాలు ఉండటం అవాస్తవమా? సుజనా సోదరుడి కుమార్తె యలమంచిలి రుషికన్యకు వీరులపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలు ఉండటం నిజం కాదా? బాలకృష్ణ వియ్యంకుడు (నారా లోకేష్‌ తోడల్లుడి తండ్రి) రామారావుకి 493 ఎకరాలను ఏపీఐఐసీ ద్వారా ఎకరం రూ.లక్ష చొప్పున ఇచ్చి ఆ తర్వాత ఆ భూములను సీఆర్‌డీఏ పరిధిలోకి తేవడం నిజం కాదా? ఇది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాదా?’ అని బొత్స ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలు డీకేటీ భూములను పట్టాలుగా మార్చి రాజధానికి ఇవ్వవచ్చని జీవో ఇస్తే వాటిని తీసుకుని ల్యాండ్‌పూలింగ్‌కు ఇచ్చారని, ఓ వ్యక్తి పేరిట 25 వేల చదరపు గజాలు ఉన్నట్టు తేలిందని దీన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనక ఇంకేమంటారో చంద్రబాబే చెప్పాలని బొత్స వ్యాఖ్యానించారు. ఇంతకంటే ఇంకేం ఆధారాలు కావాలని నిలదీశారు. ‘రాజధానిలో అభివృద్ధి ఆగిపోయిందని, రియల్‌ ఎస్టేట్‌ దెబ్బ తిందని చంద్రబాబు చెబుతున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు ఇలా పలు పట్టణాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకున్న విషయం గమనించాలి. రాజధాని విషయంలో శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పింది వినకుండా నారాయణ కమిటీ చెప్పినట్టు చేశారు’ అని బొత్స పేర్కొన్నారు. 

మెట్రో రైలు డీపీఆర్‌ అందింది..
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నివేదిక వచ్చిందని, మంగళవారం దీన్ని పరిశీలించామని బొత్స తెలిపారు. 67 కిలోమీటర్ల ప్రాజెక్టుకు రూ.24,460 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారన్నారు. సాధారణంగా రోడ్డుపై నిర్మిస్తే కిలోమీటరుకు రూ.169 కోట్లు వ్యయం అయితే భూగర్భ లైనుకు రూ.490 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారన్నారు. అమరావతిలో భూగర్భ రైలు మార్గం ఎందుకో అర్థం కావడం లేదని, అన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  

రాజధాని రైతులందరికీ కౌలు చెల్లింపులు
రాజధానికి భూములిచ్చిన రైతులందరికీ రెండు రోజుల్లో కౌలు చెల్లిస్తామని బొత్స చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ అమెరికా పర్యటనకు వెళ్లే ముందే ఈ విషయం చెప్పామని, రైతులకు ఇబ్బంది కలగకుండా సమస్యను తక్షణమే పరిష్కరించాలని సూచించారని, త్వరలోనే రూ.187.40 కోట్ల కౌలు పరిహారం చెల్లిస్తామన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, రైతుకు చీమకుట్టినా సహించదన్నారు. ప్రతి సంవత్సరం జూలై నుంచి ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో భూములిచ్చిన రైతులకు కౌలు ఇస్తామన్నారు. కృష్ణా వరదలపై పెయిడ్‌ ఆర్టిస్టులతో బురద చల్లేందుకు ప్రయత్నించి చంద్రబాబు అభాసుపాలయ్యారని బొత్స పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు